బాలల్లో సృజనకు వేదిక కల్పించేందుకే బాలోత్సవాలు, బాలవేదికలు, బాల సంఘాలు ఆవిర్భవించాయి. అయితే ప్రస్తుతం ఆ సృజనశీలతను అర్థం చేసుకుని ప్రోత్సహించే పెద్దలు నానాటికి కనుమరుగవుతున్నారు. పెద్దలు అంటే ఇక్కడ తల్లిదండ్రులు, గురువులు అని అర్థం చేసుకోవాలి. వీరిలో చాలామంది పిల్లలను నిరంతరం ప్రోత్సహించి వారిలో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత తమదని గుర్తెరగరు. ప్రస్తుత సంక్షుభిత వాతావరణంలో ఎవరి పరుగులు వారివే. పైగా ఇనిస్టింక్ట్ భౌతిక ఆనందాలకు అలవడుతూ ఆర్గానిక్ సహజానందానికి దూరమవుతున్నారు. అందుకే వారిలో కళాసాహితీ స్పర్శలు కనుమరుగవుతున్నాయి. మరి పిల్లలకేమో సహజంగానే కళాతృష్ణ వుంటుంది. ఆటలు, పాటలు, కథలు, నాటకాలంటే వారికి ఎంతో ఇష్టం. అందుకు పునాది వేయాల్సిన పాఠశాలలు, మార్కులు, ర్యాంకుల ఒరవడిలో పోటీపడ్తున్నాయి. భాష ఒకటి ఆటంకంగా మారింది. వ్యక్తీకరణ భాష ఒకటైతే చదువుకునే భాష మరొకటి. అయినా ఆ ఇబ్బందిని అధిగమిస్తూ పిల్లలు ముందుకు రావడాన్ని మనం అభినందించాలి.
ఇటీవల నాగార్జున సాగర్ సమీపానున్న రెంటచింతల గ్రామంలో (ఎ.పి) ఎం.ఎల్.ఆర్. పౌండేషన్ ఆధ్వర్యంలో 6-10 తరగతుల పిల్లలకు క్రియేటివ్ రైటింగ్ వర్క్‌షాప్ జరిగింది. దాదాపు 300 మంది పిల్లలు హాజరయ్యారు. పాటలు రాయడం- పాడటం, కథలు రాయడం- చెప్పడం, నాటకాలు (స్కిట్స్) రాయడం - వేయడంలో శిక్షణ పొందారు. ఆన్‌లైన్ గేమ్ ఎకౌంట్‌లోకి పొరపాటున వచ్చిన సొమ్ముతో (500/-) కొత్త గేమ్ క్యారెక్టర్ కొంటానని ఓ మిత్రుడు అంటే.. వద్దు, అది దొంగతనంతో సమానం. కస్టమర్ కేర్‌కు మెసేజ్ పెట్టి రిఫండ్ ఇచ్చేద్దాం అని మరో మిత్రుడు అంటాడు. ఆన్‌లైన్ అయినా ఆఫ్‌లైన్ అయినా నిజాయితీ మన బ్రాండ్ అని ఉమ్మడిగా ప్రకటిస్తారు.
ఓ పచ్చటి కొండ కింద పొలంలో పని చేసే రైతు ఓసారి కొండని ఎగాదిగా చూసి అడుగుతాడు..
నీవు ఎప్పుడూ చల్లగా సంతోషంగా ఎలా వుండగలుగుతున్నావని? అప్పుడు కొండ ‘‘నేను మట్టి నుంచి వచ్చాను. చివరకు మట్టిలో కలిసిపోతాను. మధ్యలో నాకు గొడవలెందుకు అని శాంతంగా బదులిస్తుంది. కొండ చెప్పింది మనుషులకు కూడా వర్తిస్తుంది కదా.. అని రైతు అనుకుంటాడు. ఎంత భావుకత, ఎంత తాత్వికత. ఆరేడు తరగతుల పిల్లలు ఆంగ్లంలో తెలుగులో రాసినవి ఇవి. అలాగే ఓ స్కిట్‌లో - కొందరు పేద పిల్లలు అవకాశాలు అందిపుచ్చుకుని చక్కగా చదువుకుంటారు. ధనవంతుల పిల్లలు అమిత అవకాశాలు వున్నా చదువుకోకుండా జులాయిలా తిరుగుతుంటారు. ఈ ధనవంతుల పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలంటే ఏం చేయాలి? అని ఆధునిక నాటిక పద్ధతిలో నాకటకర్త శాంతారావు ప్రశ్నిస్తే ప్రేక్షకులైన పిల్లలనుండి రకరకాల సమాధానాలొస్తాయి.
తల్లిదండ్రులు చెప్పాలి. టీచర్లు సరిదిద్దాలి. ఇలా.. చివరకు ధనవంతుల పిల్లలక్కూడా పేదల కష్టం, పేద పిల్లల బాధలు గురించి తెలిస్తే వారు కూడా చక్కగా చదువుకుంటారు అని ఏకగ్రీవంగా హర్షధ్వానాల మధ్య సమాధానపడ్తారు. ఎందుకంటే వర్క్‌షాప్‌కు హాజరైన పిల్లల్లో అప్పుడప్పుడు కూలిపనులకు వెళ్లేవారున్నారు. రోజు కూలీ 300 రూపాయలు. అలాగే పాటలు. తనతో పాటు చదువుకున్న ఓ పాప అకాల మృతి చెందితే ఆ ఎలిజీనే పాటగా మలచి పాడితే చాలామంది కన్నీటి పర్యంతం అయ్యారు. పిల్లలు రాసిన పాటలు చాట్‌జిపిటి కిస్తే అది ట్యూన్ చేసి పాడినప్పుడు ఆ పిల్లల కళ్లల్లో మెరుపు చూడాలి... పాట రాయడం శిలను శిల్పంగా చెక్కడం అయితే పాడటం ఆ శిలకు ప్రాణం పోయడం అని వి.ఆర్.శర్మ అంటారు ఈ సందర్భంలో...
ఇకపోతే గతంలో పిల్లలు రాసిన కథలనే సి.ఎ.ప్రసాద్ పిల్లలకు ఇచ్చి చదవమన్నప్పుడు వారు త్వరగా కనెక్టయ్యి ఎంతో చక్కగా విశ్లేషించారు. నిజాయితీగా మార్కులు వేసుకున్నారు. ముఖ్యంగా కథలు రాయగలం అనే ధైర్యం పొందారు ఎక్కువమంది. భాష నేర్చుకోవాలనే పట్టుదల పెరిగింది. అవినీతి పరుడైన తండ్రి లంచం తీసుకోందే ఎవరికీ సంతకం పెట్టడు. అప్పుడు ఆ పాప భయంభయంగా తండ్రి వద్దకు వెళ్లి దాచుకున్న చిల్లర డబ్బులు ఇచ్చి ప్రోగ్రెస్‌కార్డుపై సంతకం పెట్టమని అడుగుతుంది. దాంతో కన్నతండ్రి దు:ఖితుడవుతాడు. తెలిసిన కథలే అయినా ఎవరి ప్రత్యేక శైలి వారిదే. పెద్దల తప్పులు పిల్లలు ఇలా ఎత్తి చూపడం బావుంది కదా... కాబట్టి ఇలాంటి వర్క్‌షాపుల ద్వారా పిల్లలకే కాదు పెద్దలు కూడా రీచార్జ్ అవడం ఖాయం.
శైలి, 9959745723







కామెంట్‌లు (0)