Monday, August 31, 2026
E-PAPER
Homeఖమ్మంవెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరశంఖం

వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరశంఖం

- Advertisement -

– విజయవంతం చేయాలని సమన్వయకర్త రమణారావు పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి సెప్టెంబర్‌ 2 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆరు గ్యారంటీ ల అమలులో వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఏడు రోజుల పాటు వరుస నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తయినా హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ మండల సమన్వయకర్త జేకేవీ రమణారావు ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన సోమవారం ప్రకటించారు.ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన లక్ష్యమన్నారు. పారిశుధ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో నెలకొన్న సమస్యలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.

ఏడు రోజుల కార్యక్రమాల షెడ్యూల్ ను ఆయన ప్రకటించారు.
సెప్టెంబర్‌ 2: నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా, బాకీ కార్డుల పంపిణీతో పాటు 420 అడుగుల భారీ ప్లెక్సీ ప్రదర్శన.
సెప్టెంబర్‌ 3: రైతుల సమస్యలు, విద్యుత్‌, యూరియా, రైతు బీమా అమలుపై రైతు సదస్సులు.
సెప్టెంబర్‌ 4: వృద్ధులు, దివ్యాంగులు, మహిళలతో సదస్సులు. మహిళలకు రూ.2,500, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ (తులం బంగారం), విద్యార్థినులకు స్కూటీల హామీల అమలుపై నిరసనగా వంటా వార్పు.
సెప్టెంబర్‌ 5: ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జాబ్‌ క్యాలెండర్‌, యూత్‌ డిక్లరేషన్‌ అమలును డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, యువతతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు.
సెప్టెంబర్‌ 6: గ్రామాల్లో పారిశుధ్య సమస్యలపై నిరసన కార్యక్రమాలు.
సెప్టెంబర్‌ 7: మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం ద్వారా హామీల అమలుపై వినతిపత్రాల సమర్పణ.
సెప్టెంబర్‌ 8: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేత.

ఏడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులకు జూపల్లి రమణారావు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -