ఇజ్రాయిల్, లెబనాన్ అంగీకారం
వాషింగ్టన్ డీసీ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసేందుకు ఇజ్రాయిల్, లెబనాన్ అంగీకరించాయి. లెబనాన్‌లో హిజ్బుల్లాలను నిషేధించేందుకు అనేక ‘పైలట్’ భద్రతా మండలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న హిజ్బుల్లా తన దాడులను పూర్తిగా నిలిపివేయడం సహా ఇతర షరతులపై ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుందని ఇజ్రాయిల్, లెబనాన్, అమెరికా ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. లెబనాన్ భవిష్యత్తును బందీగా చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఈ మూడు దేశాలు వ్యతిరేకించాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ జరిపిన దాడులలో కనీసం తొమ్మిది మంది మరణించడం, ఆ తర్వాత ఉత్తర ఇజ్రాయిల్ పైకి హిజ్బల్లాలు రాకెట్లను ప్రయోగించడం వంటి పరిణామాల నేపథ్యంలో బుధవారం వాషింగ్టన్‌లో ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. అయితే దక్షిణ లెబనాన్‌లో గురువారం కూడా ఇజ్రాయిల్ దాడులు కొనసాగాయని, కొంత ప్రాణనష్టం జరిగిందని లెబనాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. కాగా అమెరికా మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య నాలుగో విడత చర్చలు జరిగిన అనంతరం ఈ ఒప్పందం కుదిరింది.
ఇజ్రాయిల్ సరిహద్దు-లిటానీ నది మధ్య ఉత్తరాన సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం నుంచి హిజ్బుల్లాలను పూర్తిగా ఖాళీ చేయిస్తేనే ఈ ఒప్పందం అమలవుతుందనే షరతు విధించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం ఇజ్రాయిల్ సేనల ఆక్రమణలో ఉంది. ప్రభుత్వేతర శక్తులన్నింటినీ పారద్రోలి, ఆ భూభాగాన్ని లెబనాన్ సాయుధ దళాలు తమ అధీనంలోకి తీసుకునేందుకు ఉద్దేశించిన పైలట్ మండలాల ఏర్పాటుకు అమెరికా మార్గనిర్దేశం చేస్తుందని ఒప్పందంలో తెలియజేశారు. లెబనాన్, ఇజ్రాయిల్ దేశాలు ఈ నెల 1న పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సమగ్ర ఒప్పందం కుదుర్చుకునే దిశగా తదుపరి చర్చలు జరపడానికి ఇరు దేశాల ప్రతినిధులు ఈ నెల 22న మరోసారి సమావేశమవుతారు. కాగా తాజా ఒప్పందంపై తగిన సమయంలో స్పందిస్తామని హిజ్బుల్లా తెలిపింది. అయితే ఇలా ఒప్పందం కుదుర్చుకోవడం తీవ్రమైన పొరబాటని, ఇది హిజ్బుల్లాలు మరింత బలోపేతం కావడానికి దోహదపడుతుందని ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ విమర్శించారు. ఇజ్రాయిల్-లెబనాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 16న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పోరును ఆపలేకపోయిన విషయం తెలిసిందే.
హిజ్బుల్లా దాడులు ఆపితేకాల్పుల విరమణకు ఓకే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



