తెలంగాణ ఆర్థిక ప్రయోజనాలకు దెబ్బ తగులుతోంది. ‘సొమ్మొకరిది..సొకొకరిది’ అన్నట్టుగా ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్నది. గత పదేండ్లుగా కత్తిగట్టి సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను ఆర్థికంగా దివాళా తీయిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సఖ్యత, సమన్వయానికి తూట్లు పొడుస్తున్నది. ఆర్ధిక వివక్షతను దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య విపరీతంగా అమలు చేస్తున్నది. తాను చేసిన జీఎస్టీ చట్టాన్ని తానే ఉల్లంఘిస్తూ, పన్నులు అధికంగా చెల్లించే రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో నిధులివ్వకుండా కోతపెడుతున్నది. కక్షతో సాధారణ నిధులతోపాటు కేంద్రం ప్రాయోజిత పథకాలకు ఎసరుపెట్టి రాష్ట్రాలపై ఉక్కు పాదం మోపుతున్నది. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రాన్ని నిలువునా ఎండబెడుతున్నది. లేబ్‌ర్‌కోడ్‌ల పేరుతో ఇప్పటికే పేద ప్రజల పథకాలు, కార్మిక చట్టాలను చెరబట్ట్టింది. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నది. ‘మేము చెప్పినట్టు చేస్తేనే మీకు రొక్కం’ ఇస్తామంటూ రాజ్యాంగం సాక్షిగా అల్టీమేటమ్ ఇస్తున్నది. 2018-19 నుంచి 2022-23 వరకు ఐదేండ్ల కాలంలో కేంద్రానికి రాష్ట్రాల నుంచి అందిన పన్నులు రూ.90.80 లక్షల కోట్లయితే, ఇందులో దక్షిణాది నుంచి రూ.22.86 లక్షల కోట్లు సమకూరాయి. కాగా అందులో నుంచి తిరిగి ఇచ్చింది రూ. 16.3 లక్షల కోట్లే కావడం గమనార్హం.
దక్షిణాది రాష్ట్రాలకు రూపాయికి 30 పైసలు మాత్రమే ఇస్తూ, బీహార్, ఉత్తరప్రదేశ్‌కు మాత్రం రూపాయికి రూ.4 చొప్పున మంజూరివ్వడం అక్షరాలా నగసత్యం. ఆ రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులకన్నా మూడింతలు అదనంగా అక్కడ ఖర్చుచేస్తుండటం అంతులేని వివక్షకు తార్కాణం. 2024-25లో తెలంగాణ నుంచి పన్నులు రూ.1,33,208 కోట్లు వసూలైతే, ఆ రాష్ట్రానికి రూ.51,725 మాత్రమే విడుదల చేసినట్టుగా పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి సెలవియ్యడాన్ని బట్టి పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు వివక్ష ఎంతటిదో. జీఎస్టీ చట్టాన్ని సవరించడం ద్వారా స్లాబులను తగ్గించిన నేపథ్యంలో తెలంగాణ రూ.8 వేల కోట్లు నష్టపోయిందని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించిన సంగతి జగమెరిగిన ముచ్చట. ఆర్థిక సంఘాలు సూచించిన మార్గదర్శకాలనూ కేంద్రం పక్కనబెట్టడంతో రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్య్రం అడకత్తెరలో పొక్కచెక్కలా మారుతున్నది.ప్రభుత్వ శాఖలు, రంగాల వారీగా రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు కత్తెరపెట్టడం మూలంగా తెలంగాణకు రూ.5 వేల కోట్లు నష్టం వచ్చే అవకాశముందని సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మీడియాకెక్కడమే కేంద్రం ఆర్థిక వివక్షకు రుజువు.
అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కారు, కేంద్రం వైఖరితో ఆర్థిక ఒడిదుడుకు లను ఎదుర్కొంటున్నది. నిధులివ్వకపోవడమేగాక ఇటీవల కేంద్ర బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి గుండుసున్నా పెట్టింది. మెజారిటీ ప్రజలు, పేదలకు అక్కర్లేని హైస్పీడ్ రైళ్లను మంజూరుచేసి గొప్పలకు పోతున్నది. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు గొర్రె పొకడే తప్ప శాస్త్రీయ అభివృద్ధి ఆలోచన లేకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కీలెరిగి వాతపెట్టక మానరు. ప్రజల మధ్య మత చిచ్చుపెట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి అలవాటుపడ్డ ఆ పార్టీకి, గుణపాఠం నేర్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ ఇప్పటికే రూ.8.5 లక్షల కోట్ల అప్పుల్లో మునిగింది. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 50 వేల కోట్ల నుంచి రూ. 60 వేల కోట్ల రొక్కం ఇంకా పెండింగ్‌లోనే ఉండటం అన్యాయం. నిధుల కోసం సీఎం, డీప్యూటీసీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఢిల్లీ చుట్టూ తిరిగి ఇచ్చిన వినతిపత్రాలను కేంద్రం చెత్తబుట్టలో పడేసింది. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటం చేయకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశాలెక్కువ. కేరళలో రైతులకు బోనస్ ఇవ్వొద్దంటూ అక్కడి వామపక్ష సర్కారును వేధిస్తున్నది, బెదిరిస్తున్నది. మెతకగా వ్యవహరిస్తే బీజేపీయేతర రాష్ట్రాలు వాటిలోని ప్రజలు అనేక కష్టాలకు గురవుతాయి. అందుకు ఆయా రాష్ట్రాలు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలి.
కేంద్రం వివక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



