యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్
మెదక్‌లో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర మహాసభలు, బ్రోచర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-మెదక్ టౌన్
సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్య లతో పాటు సామాజిక పోరాటాల్లోనూ సీఐటీయూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ అన్నారు. సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 7నుంచి 9వ తేదీ వరకు మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం మెదక్ ప్రజా సంఘాల కార్యాలయం కేవల్ కిషన్ భవనంలో ఆహ్వాన సంఘం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లా డుతూ.. 33 జిల్లాలు, 60 రకాల రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 1000 మంది ప్రతినిధు లతో డిసెంబర్‌లో మహాసభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహాసభ మొదటి రోజు డిసెంబర్ 7న మెదక్ పట్టణంలో వేలాది మంది కార్మికులతో ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభల నిర్వహణ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, మేధావులు, ప్రజలు ఆర్థిక, హార్థిక, సహాయ, సహకారాలు అందించాలని కోరారు.
1970లో ఆవిర్భవించిన సీఐటీయూ.. నాటి నుంచి సంఘటిత, అసంఘ టిత శ్రామిక జన ప్రయోజనాలకోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై నికరమైన పోరాటాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, ధరల పెరుగుదల, కార్మికులు, ఉద్యోగుల అక్రమ తొలగింపుల నుంచి, నేటి పాలకులు అక్రమంగా తెచ్చిన లేబర్ కోడ్స్ వరకు.. కార్మిక వర్గానికి గొడ్డలిపెట్టులాంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించినట్టు తెలిపారు. సంఘీభావ పోరాటాలు, సామాజిక న్యాయ పోరాటాల్లోనూ సీఐటీయూ చురుకైన పాత్ర పోషించిందన్నారు.
రాష్ట్రంలో గ్రామీణ పేదలకు సేవలు అందించే సంక్షేమ పథకాల అమలు, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల సాధనకు పోరాడుతుందని అన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయితీ కార్మికుల, హమాలీ, ట్రాన్స్పోర్ట్, భవన నిర్మాణంలాంటి అసంఘటిత కార్మికులను సంఘటిత పరుస్తున్నది కేవలం ఒక సీఐటీయూ సంఘామే అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య, మల్లికార్జున్, ఆహ్వాన సంఘం వైస్ చెర్మెన్ అడివయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, ఏ.మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, కడారి నాగరాజు, బస్వరాజు, సహాయ కార్యదర్శి సంతోష్, గౌరయ్య, నాయకులు మల్లేశం, అజేరు, ప్రవీణ్, బాబు తదితరులు పాల్గొన్నారు.