Tuesday, September 1, 2026
E-PAPER
Homeజాతీయం5న సీజేపీ మార్చ్ ను ఆపలేం

5న సీజేపీ మార్చ్ ను ఆపలేం

- Advertisement -

అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని ముందే ఊహించలేం
స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం
మార్చ్‌కు ముందే విచారణ చేపట్టాలన్న పిటిషనర్‌ విజ్ఞప్తి తిరస్కరణ
కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ
విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కేసులను ఉపసంహరించడంలో కేంద్రం విఫలమైందని విమర్శిస్తూ ఈ నెల 5న ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన ప్రదర్శనను ఆపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసన సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని ముందుగానే ఊహించి ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. శాంతి భద్రతలు, అనుమతులు వంటి అంశాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉంటాయని పేర్కొంది. దేశ రాజధానిలోని సున్నిత ప్రాంతాల్లో భారీ నిరసనలు, ర్యాలీలు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని రిటైర్డ్‌ ఢిల్లీ పోలీసు అధికారి రాజేంద్ర సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈనెల 5కు ముందే విచారణ చేపట్టాలన్న పిటిషనర్‌ విజ్ఞప్తిని తిరస్కరించింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఇతర కేసులతో కలిపి దీనిని విచారించనున్నట్టు తెలిపింది. పిటిషనర్లు తమ విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నియమించిన హైపవర్ కమిటీ ఎదుట ఉంచాలని సూచించింది. సీజేపీ నిర్వాహకులు ఈనెల 5న నిర్వహించనున్న ర్యాలీకి ఇప్పటివరకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తనకు తెలియదని పిటిషనర్‌ తరపు న్యాయవాది రిజాన్‌ అహ్మద్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్‌ సదస్సు జరగనున్న నేపథ్యంలో భద్రతా పరంగా ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల నిరసనను వాయిదా వేయాలని కోరారు. అయితే నిరసన సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని ముందుగానే ఊహించడానికి ప్రస్తుత పరిస్థితుల్లో కారణం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు.

విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు 
సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం
పరీక్షా పత్రాల లీకేజీ ఆరోపణలపై జులైలో జంతర్‌‌మంతర్‌ ‌వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించడంలో కేంద్రం విఫలమైందని విమర్శిస్తూ సీజేపీ ఈనెల 5న నిరసనకు పిలుపునిచ్చింది. ఇదే డిమాండ్‌తో గతంలో చేపట్టిన విద్యార్థుల ఆందోళనకు కొనసాగింపుగా తాజా నిరసనను ప్రకటించింది. ఇదిలా ఉండగా, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు దాఖలు చేసిన దరఖాస్తును అత్యవసరంగా విచారించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సోమవారం సుప్రీంకోర్టును కోరారు. అయితే ఈనెల 5న ఢిల్లీలో సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు కొద్ది రోజుల ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ వద్ద తుషార్‌ మెహతా ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థుల నిరసనలకు సంబంధించిన కేసులను ఎత్తివేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద సుప్రీంకోర్టు అసాధారణ అధికారాలను వినియోగించాలని కేంద్రం కోరుతున్నట్టు తెలిపారు. దీనిపై సీజేపీ సానుకూలంగా స్పందిస్తూ, సమస్య పరిష్కారం దిశగా అన్ని పక్షాలు ముందుకు సాగుతున్నట్లయితే దరఖాస్తును పరిశీలనకు తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు.

జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనను జులై 25న విరమించిన సమయంలో సీజేపీ పలు డిమాండ్లను ముందుకు తెచ్చింది. అందులో విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం ప్రధాన డిమాండ్‌గా ఉంది. అయితే కేంద్రం ఈ హామీ అమలులో జాప్యం చేస్తోందని, ఈ నేపథ్యంలోనే ఈనెల 5న మరోసారి నిరసన చేపట్టనున్నట్టు సీజేపీ ప్రకటించింది. కాగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఎత్తివేసే విషయంలో ఆర్టికల్‌ 142ను వినియోగించేందుకు సుప్రీంకోర్టు ఆగస్టు 18నే సుముఖత వ్యక్తం చేసింది. ఈ కేసులు వేలాది మంది యువ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. అయితే హత్య, లైంగికదాడి, అపహరణ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ వెసులుబాటు వర్తించదని స్పష్టం చేసింది.

నిరసన ప్రదర్శనపై ఏ నిర్ణయం ప్రకటించని సీజేపీ
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం సీజేపీ ఈనెల 5న తలపెట్టిన మార్చ్ కు ప్రధాన కారణాల్లో ఒకటైన విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంశాన్ని పరిష్కరించే దిశలో కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే కేంద్రం తాజా చర్య నేపథ్యంలో తమ నిరసనను విరమిస్తున్నట్టు లేదా మార్చుతున్నట్టు సీజేపీ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇదే సమయంలో 5న జరగనున్న నిరసనపై తక్షణ ఆంక్షలు విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -