నవతెలంగాణ-హైదరాబాద్: మహిళా వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ నుంచి వర్చువల్ విధానంలో ఏకంగా 8,000 స్వయం సహాయక మహిళా సంఘాల (SHG) భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేశారు.
ఈ ఉన్నత స్థాయి వర్చువల్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో పాటు కీలక అధికారులు, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా అపర కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన భారీ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు.
రాష్ట్ర అభివృద్ధి మహిళల పురోగతితోనే ముడిపడి ఉందని నమ్మిన ప్రభుత్వం తమదని సీఎం స్పష్టం చేశారు. సాధారణంగా సోలార్ ఎనర్జీ అంటే అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలు గుర్తొస్తారని, కానీ తెలంగాణలో మహిళా సంఘాల ద్వారానే 1,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తున్నామని వెల్లడించారు. అలాగే రిలయన్స్ వంటి సంస్థలు చేసే పెట్రోల్ బంక్ వ్యాపారాలను సైతం ఇకపై మహిళా స్వయం సహాయక సంఘాల చేతుల్లో పెట్టబోతున్నామన్నారు.



