నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. బుధవారం సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పూణెలో మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో పదేపదే జరుగుతున్న అక్రమాలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. తమ కలలను నాశనం చేసే సమస్యలపై ఇకపై మౌనంగా ఉండేందుకు యువత సిద్ధంగా లేదని అన్నారు. ఒక విషయం ఇప్పుడు స్పష్టమైందని, ఈ దేశ యువత ఇకపై భయపడరు, వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు. నీట్ పరీక్షకు సంబంధించిన సమస్యల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీట్, సిబిఎస్ఇ, సియుఇటి పరీక్షలకు సంబంధించిన సమస్యలతో కోటి మందికి పైగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ పరిస్థితి ఎవరు బాధ్యత వహిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జూన్ 13 నాటికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే, జూన్ 20న దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాజీనామా సమర్పించకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఇది పూణె నుండి ప్రారంభమవుతుందని, గురువారం సాయంత్రం 4.00 గంటలకు శాంతియుతంగా నిరసన చేపడతామని అన్నారు. ఆ తర్వాత లక్నో, అమృత్ సర్, జైపూర్, బెంగాల్ లో కూడా నిరసనలు చేపడతామని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగిన ప్రధాని మోడీ .. కచ్చితంగా విద్యామంత్రి రాజీనామాను సాధించగలరని ఎద్దేవా చేశారు.



