– విద్యార్థుల మెనూ ఛార్జీలను రూ.25 కు పెంచాలి
– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రూ.10 వేల వేతన పెంపు అమలు చేయాలని, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల మెనూ ఛార్జీలను రూ.25 లకు పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. బుధవారం అశ్వారావుపేటలోని సుందరయ్య భవన్‌లో మధ్యాహ్న భోజన కార్మికుల మండల కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉన్న మెనూ ఛార్జీలతో అమలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు.వంట కార్మికులకు కట్టెలు, గ్యాస్ ఖర్చుల కోసం ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని పాఠశాలల్లో కార్మికులే తమ సొంత గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తూ వంటలు చేస్తున్నారని, ప్రస్తుతం గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో ఆ పరిస్థితి మరింత భారంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం సమస్యలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల మెనూ ఛార్జీలను పెంచాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న తరహాలోనే పాఠశాలలకు గ్యాస్ సిలిండర్లు, గుడ్లను ప్రభుత్వమే అందించాలని కోరారు.
పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోపే ఈ అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వంట కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని, నాణ్యమైన రెండు జతల కాటన్ యూనిఫాంలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మురహరి రఘు, మండల కన్వీనర్ కేసుపాక నరసింహారావు, సీత, నన్నీ, నాగదుర్గ, యామిని, వెంకటలక్ష్మి, లీల తదితరులు పాల్గొన్నారు.



