నవతెలంగాణ-హైదరాబాద్: సెప్టెంబర్ నుండి “క్యా బోల్తీ పబ్లిక్” పేరుతో దేశవ్యాప్త క్షేత్రస్థాయి ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గురువారం ప్రకటించింది. మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్‌లో విలేకరుల సమావేశంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ మేరకు వెల్లడించారు. తాము చేపట్టే ఈ ఉద్యమం రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉంటుందని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని సమర్థించేందుకు జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతుందని, తాము లౌకికవాదులం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.
“ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి, వారి గొంతుకను వినాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకవేళ వారి మాట వినకపోతే, ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతారు,” అని ఆయన అన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలు, ముఖ్యంగా ఎన్నికల సంఘం “ప్రమాదకరమైన స్థితిలో” ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేడు దేశంలో వ్యవస్థాగత జవాబుదారీతనం ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఇది తమ ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదకరమైన సంకేతమన్నారు.



