నవతెలంగాణ -ముధోల్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హల్ద్వానీలోని రామలీలా మైదానంలో నిర్వహించిన సభ అనంతరం శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎస్సీ సెల్ ముథోల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జోందలే విశ్వంభర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ముథోల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై బిట్ల పెర్సిస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హల్ద్వానీ రామలీలా మైదానంలో ఖర్గే సభ అనంతరం శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని విశ్వంభర్ కోరారు. ఈ కార్యక్రమాన్ని సమర్థించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ పాత్రపైనా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనలో కుల వివక్ష, అంటరానితనానికి సంబంధించిన అంశాలు నిర్ధారణ అయితే సంబంధిత వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వివక్షకు తావులేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్, సెక్రటరీ బాసీర్, మండల అధ్యక్షుడు కిష్టయ్య, మాజీ ఎంపీపీ అఫ్రోజ్‌ఖాన్, మాజీ ఎంపీటీసీ మాక్ధూమ్, మాజీ సర్పంచులు సాయినాథ్, గౌతమ్, నాయకులు సంజు, సమీ, ధర్మేందర్, జావీద్, అనిల్ తదితరులు, పాల్గొన్నారు.


