సీఎస్ సంజయ్‌జాజు ఆదేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎకో టూరిజం అభివృద్ధి, పులుల సంరక్షణ, టైగర్ రిజర్వుల అభివృద్ధి అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఇందులో అటవీ శాఖ, పర్యాటక శాఖ సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులు, సీఎస్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎకో పర్యాటకాన్ని అభివృద్ధి పరిచడం ద్వారా యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించాలని చెప్పారు. అలాగే పర్యాటకం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రత్యేకంగా భద్రాచలం పరిసర ప్రాంతాలలో ఉన్న కిన్నెరసాని, శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతాలలో అమ్రాబాద్, గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వు, ఆదిలాబాద్, ములుగు ప్రాంతాలలో ఎకో టూరిజం అభివృద్ధికి తగిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఎకో టూరిజంను అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్రంలో విలువైన అటవీ సంపద ఉందనీ, జీవ వైవిధ్యం, సహజ ప్రకృతి అందాలను పర్యాటక అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధికి పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా ప్రాజెక్టులు రూపొందిస్తే , ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జీడీపీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఫారెస్ట్ తోపాటు టూరిజం డెవల్మెంట్ కార్పొరేషన్లు సంయుక్త భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, అనంతగిరి, వికారాబాద్, సిటీ అర్బన్ ప్రాంతాలలో ఎకో టూరిజాన్ని ప్రొత్సహించాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే, నిబంధనలకు అనుగుణంగా పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ వినయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



