ఆగస్టు 4న సహకార సంఘాల పాలకుల అభినందన సభ
తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-హయత్‌నగర్
చేనేత సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు.సహకార సంఘాల నూతన పాలకుల అభినందన సభను విజయవంతం చేయాలని కోరారు. అభినందన సభకు సంబంధించి హైదరాబాద్ హయత్‌నగర్‌లో మంగళవారం కరపత్రం, బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. మార్చి 25న ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నా ఫలితంగానే సహకార సంఘాల సభ్యుల జాబితా తయారీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. 13 సంవత్సరాల అనంతరం సహకార సంఘాలకు ఎన్నికలు జరగడం కూడా సంఘం పోరాట ఫలితమేనన్నారు. ఎన్నికైన పాలకులకు సహకార చట్టం, సంఘాల నిర్వహణ, చేనేత సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 4న ఉదయం 10 గంటలకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. అనంతరం చేనేత పారిశ్రామిక సహకార సంఘాల పాలకుల అభినందన సభను నిర్వహిస్తామని చెప్పారు.
గతంలో టెస్కో ద్వారా సహకార సంఘాల నుంచే వస్త్రాలు కొనుగోలు చేసేవారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.600 కోట్ల విలువైన వస్త్రాలను మఫత్‌లాల్ కంపెనీ నుంచి కొనుగోలు చేయడం వల్ల చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్టే ప్రభుత్వం చేనేత వస్త్రాలను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. త్రిఫ్ట్ పథకం కింద కార్మికులు 15 నెలలుగా రికరింగ్ డిపాజిట్లు చెల్లిస్తున్నప్పటికీ ప్రభుత్వం కేవలం రెండు నెలల వాటానే జమ చేసిందని, మిగిలిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోరాటాల ఫలితంగా నేతన్న భరోసా పథకం కింద చేనేత కార్మికుల ఖాతాల్లో మూడు నెలల మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసిందన్నారు. అయితే రెండు సంవత్సరాల బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, కార్యదర్శి ముషం నరహరి, చేనేత నాయకులు పెంటయ్య, రాపోలు రాములు, గజం శ్రీశైలం, తడక నర్సింహా, కర్నాటి రాములు, గడ్డం గంగయ్య, దుస్స కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోరాటాల వల్లే చేనేత సమస్యల పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



