– ప్రియుడి మోజులో పడి దారుణం
– కత్తితో పొడిచి ఇంట్లోనే పాతిపెట్టిన వైనం
– పది నెలల తర్వాత వెలుగులోకి..
– మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
నవతెలంగాణ-జవహర్‌నగర్
పేగు తెంచుకొని పుట్టిన కూతురే.. పేగుబంధాన్ని అంతమొందించే పనికి ఒడిగట్టింది. ప్రియుడి మోజులో పడిన కూతురు.. తల్లిని చంపడానికి వెనుకాడలేదు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌకూర్‌లో సుమారు పది నెలల తర్వాత వెలుగుజూసింది. ప్రియుడితో కలిసి తల్లిని కత్తితో ఛాతిలో పొడిచి, ఊపిరాడకుండా చేసి చంపేసి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టిన హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌకూర్ భరత్ నగర్‌లో అంజు(40) ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసించేది. పెద్ద కుమార్తె రిషికకు వివాహమైంది. చిన్నకుమార్తె ఇషికా ఇంటర్ చదువుతున్నప్పుడు డిసెంబర్ 2023లోనే మోంటీ కుమార్‌సింగ్ అలియాస్ రాజ్‌తో ప్రేమలో పడింది. అయితే బాలికను వేధిస్తున్నాడని ఫిర్యాదు అందడంతో రాజ్‌పై అక్టోబర్ 2024న జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో, 2025 బొల్లారం పోలీస్ స్టేషన్‌లో పోక్సో, లైంగికదాడి కేసులు నమోదు కాగా.. అరెస్టయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో కుమార్‌ను ఇషికా తల్లి అంజు గట్టిగానే మందలించింది. తన తల్లిని చంపితేనే ప్రియుడు దక్కుతాడనే భ్రమలో పడిన ఇషికా.. ప్రియుడితో కలిసి 2025 మే 12న అంజును ఇంట్లోనే కత్తితో బలంగా ఛాతిలో పొడిచి ఊపిరడకుండా చేసి దారుణంగా చంపేసింది. ఎవరికీ అనుమానం కలగకుండా మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టారు. ఎలుకల కారణంగా నేలకు మరమ్మతులు చేశామని అక్క రిషికను తప్పుదోవ పట్టించారు. తల్లి బయటకు వెళ్లిందని ఇషిక చెప్పింది. అయితే, నెలలు గడుస్తున్నా అంజు ఇంటికి తిరిగి రాకపోవడంతో పెద్ద కూతురు 2025 అక్టోబర్ 17న జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదైంది. అప్పటి నుంచి కేసు దర్యాప్తులో ఉంది. ఇటీవల నిందితురాలు ఇషిక ప్రియుడితో కలిసి యాదగిరిగుట్టలో పెండ్లి చేసుకుంది. వారికి రెండు నెలల కిందట కుమారుడు కూడా జన్మించాడు. పోలీసులకు అనుమానం వచ్చి ఇద్దరినీ తమదైన శైలిలో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. బుధవారం వారి ఇంటిని పోలీసులు పరిశీలించి గదిలో పాతిపెట్టిన మృతదేహాన్ని వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. నిందితుల నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం రిమాండ్ తరలించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించి ఛేదించిన జవహర్‌నగర్ ఎస్‌లలను ఉన్నతాధికారులు అభినందించారు.
కన్నతల్లిని కడతేర్చిన కూతురు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



