నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నివసిస్తున్న గిరిజన కుటుంబాల అభివృద్ధి, అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణను సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదటి దశలో నాలుగు గ్రామాలకు చెందిన మొత్తం 417 కుటుంబాలకు పునరావాసం కల్పించే దిశగా ముందడుగు పడింది. బుధవారం అసెంబ్లీ కౌన్సిల్ హాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో 14 మంది గిరిజన కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. రెండు విధాలుగా సహాయం చేయనున్నారు. 160 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల నగదు పరిహారం, 257 కుటుంబాలకు నాగర్‌కర్నూల్ జిల్లా బచారం వద్ద ఆధునిక గృహ వసతితో పాటుగా 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాలపెంట, కొల్లంపెంట గ్రామాలకు చెందిన కుటుంబాల అభివృద్ధికి మొత్తం రూ.62.55 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఇందులో రూ.24 కోట్లు పరిహారం కోసం, రూ.38.55 కోట్లు గృహ వసతి కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. బచారం వద్ద ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
అమ్రాబాద్ గిరిజనుల పునరావాసానికి చెక్కుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



