- కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహాధర్నా
- వ్యవసాయానికి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని
ఏడీఏ కాళ్లు మొక్కిన బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దయాకర్
నవతెలంగాణ - రాయపోల్
రాయపోల్ మండలంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం రాయపోల్ మండల కేంద్రం సబ్ స్టేషన్ వద్ద గజ్వేల్ - రామాయంపేట రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యుత్ కోతలపై నిరసన వ్యక్తం చేశారు. పంటలు చేతికి వచ్చే సమయంలో అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆవేదనతో ఏడీఈ మధుసూదన్ కాళ్లు మొక్కి బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దయాకర్ వేడుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసిన ఘనత ఉందని, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం వ్యవసాయానికి కనీసం ఐదు గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని విమర్శించారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, మోటార్లు కాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యుత్ సమస్యలపై ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తుక్కాపూర్ ఏ డి ఈ మధుసూదన్ ప్రస్తుతానికి 10 నుంచి 12 గంటల నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు శాంతించి ధర్నా విరమించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మున్నా, సర్పంచులు మాసంపల్లి రాజు, మహమ్మద్ పర్వేజ్ అహ్మద్,మాజీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, మాజీ జడ్పీటీసీ యాదగిరి, నాయకులు రాజిరెడ్డి, ఇప్ప దయాకర్, ఇస్తారి, ఉప సర్పంచ్లు రాజు,సంతోష్, వేణుగోపాల్ గౌడ్ ,వెంకట్ గౌడ్, బెస్త వెంకటి, తిరుపతి నర్సింలు, భార్గవ్,శ్రీధర్,కనకయ్య,రాజు, షాదుల్ల, సత్యనారాయణ, బాల్ నర్స్, బాగిరెడ్డి, నాగులు,కరుణాకర్, జగపతి రెడ్డి, లక్ష్మారెడ్డి, వీరస్వామి, లింగం,రవి, నవీన్ గౌడ్, విష్ణు, సంతోష్, కిషన్, రమేష్, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)