ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయమే లక్ష్యం: చల్లా ధర్మారెడ్డి
పట్టభద్రుల ఓటరు నమోదుపై పార్టీ శ్రేణులతో సమన్వయ సమావేశం
నవతెలంగాణ - పరకాల
రాబోయే వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శిస్తూ, ప్రజలు, నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
హనుమకొండలోని తన నివాసంలో ఆత్మకూరు, గీసుగొండ మండలాలతో పాటు జీడబ్ల్యూఎంసీ 15, 16, 17 డివిజన్ల బీఆర్‌ఎస్ నాయకులతో పట్టభద్రుల ఓటరు నమోదు, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ గతంలో పరకాల నియోజకవర్గ పరిధిలో సుమారు 19,500 పట్టభద్రుల ఓట్లు ఉండేవని తెలిపారు. ఈసారి అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.పట్టభద్రుల ఓటరు నమోదు, పర్యవేక్షణ కోసం క్లస్టర్లను ఏర్పాటు చేసి సమన్వయకర్తలను నియమించినట్లు తెలిపారు. గ్రామాలు, డివిజన్ల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అర్హులైన పట్టభద్రులను గుర్తించాలని సూచించారు.
ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వైద్యులు, న్యాయవాదులు, బ్యాంకు ఉద్యోగులతో పాటు డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు నిండిన అర్హులను సంప్రదించి ఓటరుగా నమోదు చేయించాలని చెప్పారు. గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం ప్రస్తుత ఎన్నికల కోసం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అర్హులందరికీ అవకాశం కల్పించేలా పార్టీ నాయకులు బాధ్యత తీసుకోవాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, నిరుద్యోగ సమస్యలు, యువత, ఉద్యోగుల ఇబ్బందులపై ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని చల్లా ధర్మారెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు, హామీల అమలుపై వాస్తవాల ఆధారంగా ప్రజలకు తెలియజేయాలని అన్నారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని, ప్రతి నాయకుడు, కార్యకర్తకు బాధ్యతలు అప్పగించి ఓటరు నమోదు నుంచి ఎన్నికల ప్రచారం వరకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల సన్నద్ధత రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఆత్మకూరు, గీసుగొండ మండలాలతో పాటు జీడబ్ల్యూఎంసీ 15, 16, 17 డివిజన్లకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)