నవతెలంగాణ - హైదరాబాద్ : బీజేపీ పాలిత మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. కామ్‌జోంగ్, ఉఖ్రుల్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మరోవైపు చస్సాద్ ప్రాంతంలో దుండగులు 10 ఇళ్లతో పాటు 20 దుకాణాలకు నిప్పంటించారు. నాగా, కుకీ-జో తెగల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కామ్‌జోంగ్ జిల్లాలోని చస్సాద్ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన కాల్పుల్లో 23 ఏళ్ల మైఖేల్ న్గామ్మిన్‌లెన్ హాకిప్ మరణించాడు. ఉఖ్రుల్ జిల్లాలోని టీఎం కసోమ్ సమీపంలో యావోలెన్ వద్ద సాయుధులు ఓ వాహనంపై జరిపిన కాల్పుల్లో 40 ఏళ్ల సందీప్ రాయ్ ప్రాణాలు కోల్పోయాడు.
అంతకుముందు చస్సాద్‌లో శుక్రవారం రాత్రి కుకీ తెగకు చెందిన డోమ్‌ఖోనీ టౌతాంగ్ బుల్లెట్ గాయాలతో మృతి చెందింది. కామ్‌జోంగ్ జిల్లాలోని మణిపూర్-మయన్మార్ సరిహద్దు ప్రాంతమైన నింగ్‌చౌ గ్రామంలో శనివారం ఉదయం సాయుధులు ఇద్దరు నాగా గ్రామస్థులను కాల్చి చంపారు. మృతులను న్గాచాన్సో నింగ్‌షెన్ (35), లీషిషన్ లీషాడాంగ్ (48)గా గుర్తించారు. దీంతో తాజా హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో నలుగురు కామ్‌జోంగ్ జిల్లాలో, మరొకరు ఉఖ్రుల్ జిల్లాలో
మరణించారు.
మరోవైపు చస్సాద్, పరిసర ప్రాంతాల్లో కనీసం 10 ఇళ్లు, 20 దుకాణాలకు దుండగులు నిప్పంటించారు. ఆస్తి నష్టం, నిరాశ్రయులైన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. భద్రతా దళాలు ఘటనాస్థలాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ‘కమిటీ ఆన్ ట్రైబల్ యూనిటీ’ కాంగ్‌పోక్‌పి జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.






కామెంట్‌లు (0)