Magazines

సీఈసీకి వ్యతిరేకంగా పోరాటాన్ని మోడీ, షాలకు వ్యతిరేకంగా మార్చారు: సీజేపీ

1 గంట క్రితం

CEC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన శాంతియుత నిరసనలను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆరోపించింది. ఈ పోరాటాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా ప్రభుత్వం మార్చిందని సీజేపీ సహ కన్వీనర్‌ అశుతోష్‌ రంకా విమర్శించారు. ముందస్తు అరెస్టు నుంచి విడుదలైన కొన్ని గంటలకే ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.


గత 72 గంటల్లో దేశవ్యాప్తంగా వేలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రంకా ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన వారిని నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులు 1975 ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నాయని అన్నారు. ప్రధాని, అమిత్‌ షాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.


ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుండా కేంద్ర ప్రభుత్వ ప్రభావంలో పనిచేస్తోందని, బీజేపీని ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని రంకా విమర్శించారు. సీఈసీకి వ్యతిరేకంగా ప్రారంభమైన తమ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంగా మార్చారని పేర్కొన్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును కూడా రంకా తప్పుబట్టారు.


అభిజీత్‌ నాయనమ్మ మరణవార్త తెలిసిన సమయంలోనూ పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపించారు. కెమెరాలు, మైక్రోఫోన్లతో వచ్చి కుటుంబ విషాదాన్ని ప్రచారానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తల్లిదండ్రులకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, వారిని ఆందోళనకు గురిచేయకుండా తన కజిన్‌తో మాట్లాడేందుకు అనుమతించాలని అభిజీత్‌ కోరినా పోలీసులు అంగీకరించలేదని రంకా తెలిపారు. నాయనమ్మ అంత్యక్రియల కోసం అభిజీత్‌ మహారాష్ట్రలోని తన స్వగ్రామానికి వెళ్తున్నారని పేర్కొన్న రంకా.. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. బెదిరింపులకు భయపడి తమ పార్టీ వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు.


తమ నిరసనలకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష నేతలకు సీజేపీ కృతజ్ఞతలు తెలిపింది. మాజీ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, మాణిక్‌ సర్కార్‌, పినరయి విజయన్‌ యువతతో కలిసి నిరసనల్లో పాల్గొనడాన్ని రంకా ప్రస్తావించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి విద్యార్థి సంఘాల సభ్యులను పోలీసులు కఠినంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. తమ పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్