- ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై యువతకు అవకాశం
- ఐటీడీఏ పీవో బీ.రాహుల్
నవతెలంగాణ - అశ్వారావుపేట
రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో వైటీసీ( యూత్ ట్రైనింగ్ సెంటర్ల) లో అగ్రి డ్రోన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ.రాహుల్ తెలిపారు. భద్రాచలం, ఇల్లందు, అశ్వారావుపేట వైటీసీల్లో ఈ శిక్షణ కార్యక్రమం అందుబాటులో ఉందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం ద్వారా పంటలకు పురుగుమందులు, ఎరువులను వేగంగా పిచికారీ చేయవచ్చని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయడంతో పాటు నీరు, మందుల వినియోగాన్ని తగ్గించవచ్చన్నారు. దీంతో రైతుల శ్రమ, సమయం, ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. పురుగుమందులతో రైతులకు ప్రత్యక్ష సంబంధం తగ్గడం ద్వారా వారి ఆరోగ్య భద్రతకు కూడా డ్రోన్ సాంకేతికత తోడ్పడుతుందని తెలిపారు. ఆధునిక డ్రోన్ టెక్నాలజీ వ్యవసాయాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు భవిష్యత్తులో కొత్త ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని అన్నారు.
డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న గిరిజన యువతీ యువకులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు భద్రాచలం, ఇల్లందు, అశ్వారావుపేటలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పీవో బీ.రాహుల్ కోరారు. మరిన్ని వివరాలకు 9441390232 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. “ఆధునిక సాంకేతికతను నేర్చుకుని వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి” అని ఐటీడీఏ పీవో బీ.రాహుల్ పిలుపునిచ్చారు.






కామెంట్‌లు (0)