Magazines

రోడ్డంతా దుమ్ము.. ఖాజానాలో సొమ్ము

4 రోజుల క్రితం

roads are dusty
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 20, 2026 | 2 నిమిషాల చదవడం

•మరమ్మత్తులకు నోచుకోని రోడ్డు..

•రాకపోకలకు తీవ్ర అంతరాయం..

•పట్టించుకోని అధికారులు..

నవతెలంగాణ-మర్రిగూడ

మండలంలోని లెంకలపల్లి గ్రామ రహదారిపై వాహనాలు వెళితే ఒక కిలో మీటర్ మేర దుమ్ము ఆవహిస్తోంది. దీంతో వెనుక వచ్చే వాహన దారుల కండ్లల్లోకి మట్టి వెళ్ళి ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టకపోవడమే కాక, పూర్తిగా గుంతల మయమైనరోడ్డుతో స్థానిక ప్రజలు, ఈ దారి గుండా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రహదారిపై నిత్యం టిప్పర్, బస్సు, లారీ లాంటి భారీ వాహనాలు రాకపోకలు సాగుతుండడంతో దుమ్ము ధూళి వ్యాపిస్తూ ఉండడంతో రోడ్డుకు ఇరువైపుల వారితో పాటు గ్రామస్తులు, చిరు వ్యాపారస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

దుమ్ము ధూళితో అనారోగ్య సమస్యలు

రహదారిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి వాహనాల రాకపోకలతో గాలిలో కలుస్తుండటంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, దగ్గు, అలర్జీ, కళ్ళ మంటలు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్లలోకి సైతం దుమ్ము చేరుతుండటంతో ఇంట్లో వస్తువులు పూర్తిగా దుమ్ము ధూళితో నిండిపోయి పరిస్థితి అద్వానంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.

ప్రమాదాలకు అవకాశం

దుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. టిప్పర్, లారీ, బస్సు లాంటి భారీ వాహనాలు వెళ్లినప్పుడు బండి వెనక నుండి ఒక 20 నుండి 30 మీటర్ల మేరా దుమ్ము లేవడంతో ఆ వాహనం వెనుక నుండి వెళ్లే ఇతర వాహనాలకు రోడ్డు సరిగ్గా కనబడక కాసేపు ఆగవలసి వస్తుందని, రహదారిపై ప్రయాణం సాఫీగా సాగాల్సింది పోయి దుమ్ము ధూళి మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని, ఇటీవల కొన్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిరు వ్యాపారస్తులకు తీవ్ర నష్టం

దుమ్ము ధూళి కారణంగా తమ వ్యాపారం సాఫీగా సాగటం లేదని, వ్యాపారం నడవకపోవడంతో ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయని రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామంలోని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కిరాణా షాపులు, హోటల్స్ ఇతర షాపులలో దుమ్ము ధూళి చేరుతుండడంతో ఆహార పదార్ధాలు,ఇతర వస్తువులు ఖరాబై ఆర్థిక నష్టం వాటిల్లుతుందని వారు వాపోతున్నారు.

అధికారులు స్పందించాలని డిమాండ్

గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను సంబంధిత అధికారులు గుర్తించి వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు ఇరువైపులా డ్రైనేజ్ పేరుతో పనులలో జాప్యం జరుగుతుండడంతో రాకపోకల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉన్నదని, తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, లెంకలపల్లి గ్రామ ప్రజలకు దుమ్ము ధూళి సమస్య నుంచి విముక్తి కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పిల్లలకు తరుచు అనారోగ్య సమస్యలు: పగిళ్ల అశోక్ (లెంకలపల్లి)

నిత్యం దుమ్ము ధూళి కారణంగా రోడ్డు సమీపంలో ఉన్న ఇండ్లలో దుమ్ము ధూళి పేరుకుపోయి పిల్లలు తరచు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇంటి బయట కాసేపు కూర్చునే పరిస్థితి లేదు, ఆహార పదార్థాలకు కూడా దుమ్ము ధూళి పడుతుంది. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలి.

ప్రమాదాలకు నిలయంగా రోడ్డు: కర్నాటి నాగరాజు (లెంకలపల్లి) 

రోడ్డు పూర్తిగా గుంతలు తేలడంతో పాదాచారులు, వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. పిల్లలు, వృద్దులు రోడ్డుపై వెళ్లాలంటే ఆందోళనకరంగా ఉన్నది. అధికారులు స్పందించి ఆలస్యం చేయకుండా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి.

ఫైనాన్స్ ప్రాబ్లం తో పెండింగ్ : శ్రీధర్ రెడ్డి (ఆర్ అండ్ బి E.E నల్లగొండ )

ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల రోడ్డు మరమ్మత్తులలో ఆలస్యం జరుగుతుంది. రిజర్వుడ్ సాంక్షన్ కు ఫైల్ పంపించడం జరిగింది. ఫైల్ అప్రూవల్ కాగానే రోడ్డు మరమత్తు పనులను చేపడతాం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్