Magazines

ఎస్ఐఆర్‌లో 15,451 మంది ఓటర్లపై ఏఎస్డీడీ గుర్తింపు

10 నిమిషాల క్రితం

ASDD
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

- అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృత క్షేత్రస్థాయి పరిశీలన

- ములకలపల్లి మండలంలో అత్యధికంగా 2,172 మంది

- ఓటర్ల వివరాలు సరిచూసుకుని సహకరించాలని ఈఆర్వో అప్పీల్

నవతెలంగాణ - అశ్వారావుపేట

అర్హులైన ప్రతి ఒక్క ఓటరు పేరు ఎన్నికల జాబితాలో నమోదయ్యేలా, ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, కచ్చితంగా రూపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 15,451 మంది ఓటర్లను ఏఎస్డీడీ (ఏ.ఎస్.డీ.డీ - ఆబ్సెంట్,షిప్టెడ్,డెడ్, డూప్లికేట్) కేటగిరీ కింద గుర్తించినట్లు ఏఈఆర్వో (నియోజకవర్గ సహాయ ఎన్నికల నమోదు అధికారి), తహసీల్దార్ దాసరి కిశోర్ తెలిపారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 118 - అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి ఓటర్ల వివరాలను సరిచూసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొత్తం 15,451 మంది ఓటర్లు ఏఎస్డీడీ కేటగిరీలో ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే ములకలపల్లి మండలంలో 2,172 మంది, అన్నపురెడ్డిపల్లి మండలంలో 1,157 మంది, చంద్రుగొండ మండలంలో 1,820 మంది, దమ్మపేట మండలంలో 4,040 మంది, అశ్వారావుపేట మండలంలో అత్యధికంగా 6,262 మంది ఓటర్లు ఏఎస్డీడీ కేటగిరీలో ఉన్నట్లు గుర్తించారు.


మొత్తం 15,451 మందిలో మరణించిన వారు 4,140 మంది, నివాసం మారిన వారు 8,994 మంది, డూప్లికేట్ ఓటర్లు 1,532 మంది, అందుబాటులో లేని వారు 692 మంది, ఇతర కేటగిరీకి చెందిన వారు 102 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో సంబంధిత బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్లను గుర్తించి, వారి వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు. ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈసీఐనెట్  ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇంట్లో లేని ఓటర్లకు సంబంధించిన వివరాలను అనెక్సర్-బీలో, నివాసం మారిన ఓటర్లకు సంబంధించిన వివరాలను అనెక్సర్-సీలో నమోదు చేసి పరిశీలిస్తున్నట్లు తెలిపారు.


ఇప్పటికే ఎస్‌ఐఆర్ సమయంలో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డూప్లికేట్ నమోదులు, ఇతర లోపాలను గుర్తించి సరిచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఒకే ఓటరు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండకుండా ఎన్నికల జాబితాను కచ్చితంగా రూపొందించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని వివరించారు.

ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా సహకరించాలని కోరారు. సంబంధిత ఓటర్లు తమ ప్రాంత బీఎల్‌వోలను సంప్రదించి, అవసరమైన ఫారాలు, పత్రాలను సమర్పించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సహకరించాలని అశ్వారావుపేట నియోజకవర్గ సహాయ ఎన్నికల నమోదు అధికారి, తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్