-టెంకంపేట్‌లో అధికారుల చొరవతో నిలిచిన బాల్యవివాహం.
-బాల్య వివాహాలపై సమాచారం ఇస్తే 1098కు ఫోన్ చేయాలి
నవతెలంగాణ - రాయపోల్
రాయపోల్ మండలం టెంకంపేట్ గ్రామంలో శనివారం రాత్రి జరగాల్సిన బాల్య వివాహాన్ని మహిళా శిశు సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం అధికారులు సమన్వయంతో అడ్డుకున్నారు. బాల్య వివాహం జరగనున్నట్లు సమాచారం అందడంతో అధికారులు వెంటనే గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి వివాహాన్ని నిలిపివేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహ నిరోధక చట్టం-2006 ప్రకారం బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిపారు.
]
బాలికకు 18 సంవత్సరాలు, బాలుడికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని స్పష్టం చేశారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల పిల్లల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసం దెబ్బతినడమే కాకుండా వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.ఈ సందర్భంగా బాలల పరిరక్షణ ప్రతినిధి బాయికాడి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి బాలబాలికకు నాణ్యమైన విద్యను అందించి, వారి ఆశయాలను నెరవేర్చుకునే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ షబానా, రెవెన్యూ అధికారి నరసింహ, పోలీసు సిబ్బంది, అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)