- బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్వేల్ రామచంద్రం
నవతెలంగాణ–రాయపోల్
సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో అయ్యప్ప మాలధారణ విషయంలో దళిత అయ్యప్ప స్వాములకు జరిగిన అవమానకర ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి గజ్వేల్ రామచంద్రం తెలిపారు.కులం పేరుతో వివక్ష చూపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని,భక్తి, ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరికీ సమాన హక్కులని పేర్కొన్నారు.మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కూతవేటు దూరంలో ఆయన నియోజకవర్గంలో దళితులకు అన్యాయం జరిగితే మాజీ సీఎం,గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
దేవుడు అంటే అందరికీ సమానమని, భక్తి పూజల విషయంలో తారతమ్యాలు చూపించడం సరైన పద్ధతి కాదన్నారు.గుజరాత్లో దళితులపై దాడులు జరిగినప్పుడు విమర్శలు చేసే రాజకీయ నాయకులు,తెలంగాణలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.కేసీఆర్ ఇప్పటికైనా ములుగు గ్రామాన్ని సందర్శించి బాధిత దళిత అయ్యప్ప స్వాములను పరామర్శించాలని,వారికి నైతికంగా అండగా నిలవాలని కోరారు.ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 కల్పించిన సమానత్వ హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, గ్రామంలో కులవివక్ష నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు.దళితులపై ఎక్కడ అన్యాయం జరిగినా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ప్రశ్నించాలని,ఆత్మగౌరవం,హక్కుల పరిరక్షణ కోసం దళితులంత ఐక్యంగా ఉండాలని గజ్వేల్ రామచంద్రం పిలుపునిచ్చారు.






కామెంట్లు (0)