నెల రోజులు గడిచినా ధాన్యం కొనుగోళ్లు శూన్యం

27 నిమిషాల క్రితం

grain purchase
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

- వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం..రైతుల ఆవేదన

నవతెలంగాణ–రాయపోల్

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం మండల అధ్యక్షులు కాసుల మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటి వరకు ఒక్క బస్తా ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఇటీవల రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయిందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.


ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. వర్షాలతో ధాన్యం నాణ్యత దెబ్బతింటే రైతులకు మరింత నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా నిబంధనల ప్రకారం పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర కల్పించి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కాసుల మహేందర్ రెడ్డి ప్రభుత్వాలను కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్