-క్రై స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ సుప్రజ
నవతెలంగాణ–రాయపోల్
చిన్నారుల సమగ్ర అభివృద్ధికి పూర్వ బాల్య సంరక్షణ, విద్య ఎంతో కీలకమని క్రై స్వచ్చంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ సుప్రజ అన్నారు. శనివారం రాయపోల్ మండలం రామారం అంగన్వాడి కేంద్రంలో ఈసీస్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నాణ్యమైన విద్య,పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అందించడంతో పాటు వారి శారీరక,మానసిక, సామాజిక వికాసానికి ప్రత్యేక కృషి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కథలు చెప్పడం, పాటలు పాడించడం,బొమ్మలు వేయించడం,ఆటల ద్వారా అక్షరాలు,సంఖ్యలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆటపాటల ఆధారిత విద్యాబోధనతో పిల్లల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తున్నారు.అలాగే చిన్నారుల ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి వ్యక్తిగత ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. పిల్లల అభ్యసన ప్రగతిని ప్రతిభ ప్రదర్శన ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు.ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం,సామాజిక విలువలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు.దీనికి తోడు అంగన్వాడి కేంద్రంలో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో తల్లిదండ్రుల భాగస్వామ్యం,ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలన్నారు.బాల్యం నుంచే సరైన పోషణ,ఆరోగ్య సంరక్షణ,నాణ్యమైన విద్య అందిస్తే పిల్లలు భవిష్యత్తులో సమర్థవంతమైన పౌరులుగా ఎదుగుతారని ఈసీసీ డే కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలు పునాదులుగా నిలుస్తున్నాయి.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊషిగారి స్వామి,ఉప సర్పంచ్ పద్మ,క్రై స్వచ్చంద సంస్థ జిల్లా కో- ఆర్డినేటర్ రాజలింగం,రిలయన్స్ ఫౌండేషన్ బ్లాక్ కో-ఆర్డినేటర్ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి బాలయ్య,అంగన్వాడి టీచర్ సరస్వతి,ఆయా రేణుక, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)