- పూర్తి పారదర్శకత, కచ్చితత్వంతో సర్వే నిర్వహణ
- సబ్ కలెక్టర్ భూ రీ-సర్వే క్షేత్రస్థాయి పరిశీలన
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న భూముల రీ-సర్వే పనుల ప్రక్రియను శుక్రవారం సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న భూ-సర్వే ప్రక్రియ, భూముల హద్దుల నిర్ధారణను, భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆయన స్థానిక రైతులతో ముఖాముఖిగా సమావేశమై
రీ-సర్వే ప్రక్రియపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వినతులను స్వీకరించారు.
రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు. సర్వే సమయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా, భూ హద్దులకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ రీ-సర్వే పనులను పూర్తి పారదర్శకతతో, కచ్చితత్వంతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు సర్వే సిబ్బందికి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ స్పష్టం చేశారు.






కామెంట్లు (0)