గత ప్రభుత్వంలో ఉద్యమకారులను అణగదొక్కింది
మిడ్జిల్ ఉమ్మడి మండల జేఏసీ కన్వీనర్ విజయ్ కుమార్
నవతెలంగాణ-మిడ్జిల్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులను గుర్తించి, ప్రజా ప్రభుత్వం వారికి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని మిడ్జిల్ ఉమ్మడి మండల జేఏసీ కన్వీనర్ విజయ్ కుమార్ ప్రజా ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు శ్రమించిన నిజమైన నాయకులకు, ఉద్యమకారులకు ప్రభుత్వ పథకాలు మరియు రాజకీయ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పోరాడిన ఎంతో మంది ఉద్యమకారులు ఇప్పటికీ సరైన గుర్తింపునకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
అయితే, ఈ గుర్తింపు ప్రక్రియ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా జరగాలని కోరారు. గత ప్రభుత్వంలో ఉద్యమ నాయకులను అనుగదొక్కి గుర్తింపు లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఎంతోమందిపై కేసులు నమోదు కావడంతో ఉద్యోగాలు రాక, వ్యవసాయాలు చేసుకోలేక కుటుంబాన్ని పోషించలేక , అప్పుల బాధతో కృంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జిల్ లాంటి గ్రామీణ ప్రాంతాల నుండి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, కేసులు ఎదుర్కొన్న వారిని గుర్తించి న్యాయం చేయాలని విజయ్ కుమార్ ప్రజా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు దరఖాస్తులు స్వీకరించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ జారీ చేయడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. మిడ్జిల్, ఊరుకొండ మండలాలలోని రాజకీయాలకు అతీతంగా ఉద్యమ నాయకుల సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తానని చెప్పారు.






కామెంట్లు (0)