నవతెలంగాణ - అశ్వారావుపేట
జల సంరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమానికి బచ్చువారిగూడెం గ్రామపంచాయతీ వేదికైంది. అశ్వారావుపేట మండలంలోని బచ్చువారిగూడెం గ్రామపంచాయతీలో గురువారం ఒకే రోజు 57 ఇంకుడు గుంతల నిర్మాణ పనులను సామూహికంగా ప్రారంభించి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా పంచాయతీ అధికారి అనూష హాజరై గ్రామంలో వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో 57 ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.వీఓ భవనానికి అనుబంధంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు.
వర్షపు నీటిని వృథా కాకుండా భూగర్భంలోకి మళ్లించడం, భూగర్భ జలమట్టాలను పెంపొందించడం, నీటి వనరులను కాపాడటంతో పాటు గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఒకే రోజు 57 ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా సామూహిక జల సంరక్షణకు గ్రామస్థాయిలో నాంది పలికినట్లయింది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాల్మీకి కిశోర్, ఎంపీఓ రామకోటరెడ్డి,సర్పంచ్ జెట్టి వెంకటేశ్వరరావు,ఇతర ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జల సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా సామూహిక బాధ్యత కూడా అనే సందేశాన్ని బచ్చువారిగూడెం కార్యక్రమం చాటిచెబుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇతర గ్రామపంచాయతీల్లోనూ అమలు చేసేందుకు మార్గం సుగమం కానుంది.






కామెంట్లు (0)