- ఐదు చోట్ల మహిళా సమైక్య భవనాల ప్రారంభం
- మహిళా సంఘాలకు భవనాలు అందజేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాల నిర్వహణకు నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆసుపాక, నారాయణపురం, బచ్చువారిగూడెం గ్రామపంచాయతీల పరిధిలో ఐదు చోట్ల నిర్మించిన మహిళా సమైక్య భవనాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించి ఆయా మహిళా సంఘాలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో డ్వాక్రా మహిళలు సమావేశాలు నిర్వహించుకునేందుకు సరైన వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. ప్రస్తుతం నిర్మించిన భవనాలు మహిళా సంఘాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఆయా భవనాల్లో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకుంటూ, సంఘాల ఆర్థిక లావాదేవీలు, పొదుపు, రుణాలు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలపై చర్చించుకోవచ్చని సూచించారు.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, ఆసుపాక, నారాయణపురం,బచ్చువారిగూడెం సర్పంచ్ లు సోడెం ఆదిలక్ష్మి,మడకం కుమారి, జెట్టి వెంకటేశ్వరరావు లు, జిల్లా పంచాయతీ అధికారిణి అనూష,సెర్ప్ ఏపీఎం దేవమణి,ఎంపీఓ రామకోట రెడ్డి లు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)