ఈ నెల 15 నుంచి 18 వరకు ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు..
మహాసభలను జయప్రదం చేయండి – సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ – ఆలేరు రూరల్
రైతాంగ సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలకు నూతన కార్యాచరణ రూపొందించే దిశగా నల్లగొండ వేదికగా ఈ నెల 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. శుక్రవారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాసభల ప్రచార గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ..రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆచరణలో కార్పొరేట్ అనుకూల విధానాలతో రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు.
వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నా.. రైతులు పండించిన పంటలకు తగిన ధర లభించకపోవడంతో సాగు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసమాన మార్కెట్ వ్యవస్థ, బలహీనమైన సామాజిక భద్రత, ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు.సామ్రాజ్యవాద, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా సాగిన చారిత్రక పోరాటాల స్ఫూర్తితో రైతాంగ హక్కుల సాధనకు ఏఐకేఎస్ నిరంతరం పోరాడుతోందన్నారు.
ఈ జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 950 మందికి పైగా ప్రతినిధులు, పరిశీలకులు, నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ, రైతాంగ సమస్యల పరిష్కార మార్గాలపై మహాసభల్లో సమగ్ర చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 15న నల్లగొండలోని ఎన్జీ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న బహిరంగ సభ, ప్రదర్శనలో రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మోరిగాడి చంద్రశేఖర్,తాళ్లపల్లి గణేష్,వడ్డేమాన్ బాలరాజు,ఘనగాని మల్లేశం, డీవైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు యాసారపు ప్రసాద్,ఇస్తారి,బిక్షపతి,సైదాపురం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)