- పోచంపల్లి ఫ్లెక్సీల చింపివేతతో పరకాలలో కలకలం
- బీఆర్ఎస్లో నాయకత్వ సమీకరణాలపై చర్చ.. ధర్మారెడ్డి వర్గీయులపైనే అనుమానాలు.. పోలీసుల విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి!
నవతెలంగాణ -పరకాల: క్రికెట్ లీగ్ ఇంకా ప్రారంభం కాకముందే పరకాల నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన సన్నాహక సమావేశం నేపథ్యంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చిత్రాలతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయ చర్చకు దారితీయగా, ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వాటిని చింపివేయడం మరింత కలకలం రేపింది. ఈ ఘటన వెనుక బీఆర్ఎస్లోని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్గానికి చెందిన వ్యక్తుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పరకాల బీఆర్ఎస్లో అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చ మొదలైంది.
పోచంపల్లి ఫ్లెక్సీలతో రాజకీయ చర్చ!
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి స్వస్థలం పరకాల నియోజకవర్గంలోని ప్రస్తుత నడికూడ మండలం వరికోలు గ్రామం. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆయన పర్యటన, స్థానికంగా నిర్వహించనున్న క్రికెట్ లీగ్‌కు సంబంధించిన సన్నాహక సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమం ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీల్లో బీఆర్ఎస్ అగ్రనేతలతో పాటు నియోజకవర్గ ఇన్చార్జి చల్లా ధర్మారెడ్డి చిత్రాలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది.
ఫ్లెక్సీల్లో స్థానిక నాయకత్వానికి చోటేదీ?
సాధారణంగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల ప్రచారంలో స్థానిక నియోజకవర్గ ఇన్చార్జిలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఈసారి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు పోచంపల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీల ఏర్పాటు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇది కేవలం క్రీడా కార్యక్రమానికి సంబంధించిన ప్రచారమేనా? లేక పరకాల రాజకీయాల్లో పోచంపల్లి తన ఉనికిని చాటుకునే ప్రయత్నమా? అనే చర్చ మొదలైంది.
ఆదివారం రాత్రి ఫ్లెక్సీల చింపివేత!
ఇప్పటికే ఫ్లెక్సీల రూపకల్పనపై రాజకీయ చర్చ జరుగుతున్న తరుణంలో ఆదివారం రాత్రి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఫ్లెక్సీలను కొందరు వ్యక్తులు చింపివేసినట్లు సమాచారం. ఈ ఘటన వెనుక ధర్మారెడ్డి వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణానికి చెందిన ఒక కౌన్సిలర్, మరో మాజీ కౌన్సిలర్ కలిసి ఈ ఫ్లెక్సీలను చింపివేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. ఘటనపై పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.
బీఆర్ఎస్లో భవిష్యత్తు నాయకత్వంపై చర్చ!
ప్రస్తుతం పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొనసాగుతున్నారు. మరోవైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి స్థానికంగా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో పరకాల బీఆర్ఎస్ రాజకీయాల్లో నాయకత్వం, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం అంశాలు ఎలాంటి చర్చకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఒక క్రీడా టోర్నమెంట్‌కు సంబంధించిన సన్నాహక కార్యక్రమం చుట్టూ మొదలైన ప్రచారం, ఫ్లెక్సీల చింపివేత ఘటనతో రాజకీయ రంగు పులుముకుంది. క్రికెట్ మైదానంలో పోటీలు ప్రారంభం కాకముందే రాజకీయ మైదానంలో మొదలైన ఈ పరిణామాలు పరకాల బీఆర్ఎస్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ఫ్లెక్సీల చింపివేత వెనుక ఉన్నది ఎవరు? ఆరోపణల్లో వాస్తవమెంత? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.







కామెంట్లు (0)