Magazines

ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నిర్వాకం

14 నవంబర్, 2026

Private schoo
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

- విద్యార్థిని భవిష్యత్తుతో చెలగాటం

- ​టీసీ కోసం వెళ్తే ఇంటిపేరు, పుట్టిన తేదీ మార్చిన వైనం

- ​సవరణ కోసం మా స్కూల్‌లోనే చదవాలంటూ షరతులు

- పాఠశాల ఎదుట తండ్రీకూతుళ్ల బైఠాయింపు

నవతెలంగాణ-సత్తుపల్లి 

​వేంసూరు మండలం మర్లపాడు గ్రామానికి చెందిన పిల్లి సుధాకర్ తన కుమార్తె సిరివెన్నెలను గత రెండేళ్ల క్రితం సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలోని 'న్యూ సాంగ్ హై స్కూల్'లో ఒకటి, రెండో తరగతులు చదివించారు. ఇటీవల సిరివెన్నెల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం పరీక్ష రాసి ఉత్తీర్ణురాలై సీటు సాధించింది. ఈ నేపథ్యంలో గురుకులంలో చేర్పించేందుకు గాను టీసీ (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్) ఇవ్వాల్సిందిగా తండ్రి సుధాకర్ సదరు పాఠశాల యాజమాన్యాన్ని కోరారు. అయితే, పాఠశాల రికార్డులలో విద్యార్థిని పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేయడమే కాకుండా, ఇంటిపేరు 'పిల్లి'కి బదులుగా 'పూరేటి' అని రాసి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ తప్పులను సవరించాలని కోరగా తమ పాఠశాలలోనే కొనసాగితేనే వివరాలను మారుస్తామని, లేదంటే ఏ స్కూల్‌కు వెళ్లినా తప్పులతో కూడిన రికార్డులే ఉంటాయని సిబ్బంది బెదిరింపులకు దిగారని సుధాకర్ వాపోయారు.


​గత నలభై రోజులుగా పాఠశాల చుట్టూ తిరుగుతున్నా మా ప్రిన్సిపాల్ విదేశాలకు వెళ్లారని, ఆయన వచ్చేవరకు వేచి చూడాలని,  లేదా మేము అడిగినంత ఫీజు చెల్లించి ఇక్కడే చదివించాలంటూ అంటూ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన సుధాకర్ తన కుమార్తె సిరివెన్నెలతో కలిసి శనివారం పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, తల్లిదండ్రులను మానసిక వేదనకు గురిచేస్తున్న ఇలాంటి ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్