Magazines

యాసంగిలో వరి సాగు వద్దే వద్దు.. 

2 గంటల క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

- ప్రత్యామ్నాయ పంటలే ముద్దు!

- ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితుల అంచనా

- యాసంగి - 2026 లో జీరో ప్యాడీ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం

- శనగ, జొన్న, మొక్కజొన్న, కుసుమ తదితర పంటల సాగుకు ప్రోత్సాహం

- ఈ నెల 16 లోగా పంటల వైవిధ్యీకరణ వివరాల నమోదు పూర్తి చేయాలని ఆదేశాలు

నవతెలంగాణ - అశ్వారావుపేట

ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్‌లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించింది. 2026 యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణాన్ని సున్నాకు పరిమితం చేయాలని, 'జీరో ప్యాడీ టార్గెట్‌' సాధనకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.


ఈ మేరకు శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన వెబెక్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌, ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతోపాటు భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశాలున్నాయని సమావేశంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వరి, ఇతర అధిక నీటి వినియోగ పంటలకు సాగునీటి లభ్యత సరిపోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అందువల్ల రైతులను వరి సాగు నుంచి తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ వ్యవసాయ, ఉద్యానవన పంటల వైపు మళ్లించాలని అధికారులకు సూచించారు.


నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి శనగ, జొన్న, మొక్కజొన్న, కుసుమ తదితర పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. తగిన బోరుబావులు, ఇతర హామీతో కూడిన సాగునీటి వసతులు ఉన్న ప్రాంతాల్లో కూరగాయలు, ఉద్యానవన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించవచ్చని తెలిపారు. వరి సాగు చేయవద్దనే ప్రభుత్వ సూచనను గ్రామస్థాయి సమావేశాలు, వాట్సాప్‌ గ్రూపులు, ముద్రణ, ఎలక్ట్రానిక్‌ మీడియా తదితర మాధ్యమాల ద్వారా రైతులకు విస్తృతంగా తెలియజేయాలని పేర్కొన్నారు.

రాబోయే కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ప్రతి రైతును వ్యక్తిగతంగా కలిసి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సమాయత్తం చేయాలని సూచించారు. పంటల వైవిధ్యీకరణ వివరాల నమోదుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. రైతుల వివరాలు, వారు ఎంచుకున్న ప్రత్యామ్నాయ పంటల సమాచారాన్ని అందులో నమోదు చేయాలని తెలిపారు.


ఈ నెల 16వ తేదీ సోమవారం సాయంత్రంలోగా రైతుల సమీకరణ, ప్రత్యామ్నాయ పంటల ఎంపిక, యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని గడువు విధించారు. ప్రస్తుతం వరి సాగు లేని మండలాలు, గ్రామాల్లోనూ నీటి వసతులు ఉన్న ప్రాంతాలను గుర్తించి అనువైన వ్యవసాయ, ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. వరి సాగు చేపట్టే పరిస్థితులను తీవ్రంగా పరిగణించి సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా పంటల వైవిధ్యీకరణ లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్