క్రీడల అభివృద్ధికి శాసనసభ్యుడిగా, ఒక క్రీడాకారుడిగా నా సంపూర్ణ సహకారం
భీంగల్ కృషి పాఠశాలలో ఘనంగా 70వ SGF అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీలు ముగింపు వేడుకలు
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ - భీంగల్
చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెంపొందుతుందని బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. భీంగల్ పట్టణంలోని కృషి పాఠశాల ఆతిథ్యంలో నిర్వహిస్తున్న అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను, కష్టనష్టాలను సమతుల్యంగా ఎదుర్కొనే మనోనిబ్బరం కేవలం క్రీడల ద్వారానే అలవడుతుందని తెలిపారు.
ఆటల్లో పాల్గొనడం వల్ల ఒత్తిడిని జయించే మానసిక పరిపక్వత లభిస్తుందన్నారు. ప్రస్తుత రోజుల్లో పిల్లలు స్మార్ట్ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్‌లకు బానిసలవుతుండటం పట్ల ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్లు, టీవీల వినియోగం వల్ల పిల్లలపై దుష్పరిణామాలు కలుగుతాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని కోరారు. ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు పిల్లలు క్రీడా మైదానంలో ఆడుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనలో సగం క్రీడాస్ఫూర్తి (స్పోర్ట్స్‌మ్యాన్ స్పిరిట్) ప్రవహిస్తుందని, అనివార్య కారణాల వల్ల టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి రాలేకపోయినప్పటికీ, నిర్వాహకుల ఆహ్వానం మేరకు బిజీ షెడ్యూల్లోనూ క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు విచ్చేశానని తెలిపారు.
క్రీడల పట్ల ఉన్న మక్కువతో ఖర్చుకు వెనుకాడకుండా మండల స్థాయి క్రీడా పోటీలకు ఆతిథ్యమిస్తున్న కృషి పాఠశాల ఫౌండర్ వేముల రవీందర్ రెడ్డి, అజిత్ రెడ్డి మరియు పాఠశాల యాజమాన్యాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. గతంలో తన తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి కలిసి వేల్పూరులో వివిధ క్రీడలు ఆడేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
నియోజకవర్గంలో క్రీడలను సజీవంగా ఉంచుతూ, టోర్నమెంట్‌ను విజయవంతంగా నడిపిస్తున్న పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయ) సోదరీసోదరులు, విద్యాసాగర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమణ మరియు భీంగల్ ఎంఈఓలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కృషి పాఠశాల ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)