సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని శివన్నగూడ రిజర్వాయర్ నుండి నారాయణపురం మండల కమిటీ అద్వర్యంలో రాచకొండ సాగునీటి ఎత్తిపోతల పథకం సాధనకై చేపట్టిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. గత కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా నాగార్జునసాగర్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. మునుగోడు ప్రాంతం అంటేనే ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉన్న ఏరియా అని గత కొన్ని సంవత్సరాలుగా సమస్యల సాధనకై అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
మునుగోడు దేవరకొండ ప్రాంతాలు తాగు సాగునీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలన్నారు. ఆ సమస్య పరిష్కారం రిజర్వాయర్ల నిర్మాణం తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 2015 లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ శివన్నగూడ రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశారని, నేటికీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కాలయాపన ఆపి రిజర్వాయర్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాచకొండ ఎత్తిపోతల పథకం తప్పనిసరిగా అవసరమని నారాయణపురం, చౌటుప్పల్ మండలాలు సస్యశ్యామలం కావాలంటే రాచకొండలో ఎత్తిపోతల పథకం ఏర్పాటు అవసరమని డిమాండ్ చేశారు. నవంబర్1, 2 ,3 తేదీలలో రాచకొండ ఎత్తిపోతల సాధనకై నారాయణపురం మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యేంతవరకు పోరాడుతామని హామీ ఇచ్చారు.
ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది సీపీఐ(ఎం): భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది సీపీఐ(ఎం) పార్టీ అని సీపీఐ(ఎం) భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. నారాయణపురం, చౌటుప్పల్ మండలాలలో తాగునీటి సమస్య అధికంగా ఉన్నదని ఆ సమస్యకు పరిష్కారం కావాలంటే రాచకొండ ఎత్తిపోతల పథకం ఏర్పాటుతోనే సాధ్యమవుతుందన్నారు. రూ.6200 కోట్లతో అంచనా బడ్జెట్ తో ఏర్పాటైన శివన్నగూడ ప్రాజెక్టు కు కేవలం 1500 కోట్లు మాత్రమే ప్రభుత్వాలు ఖర్చు చేశాయన్నారు. కేవలం పాలకుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టులు వెనక పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
శివన్నగూడెం రిజర్వాయర్ పూర్తి చేయాలని, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాలని, రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో సీపీఐ(ఎం) పాదయాత్ర చేసిందని అది చూసిన తర పార్టీలు ప్రస్తుతం రిజర్వాయర్లు ఏర్పాటుపై హడావుడి చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా శివన్నగూడ రిజర్వాయర్ పూర్తి చేయాలని అదేవిధంగా రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శివన్నగూడ రిజర్వాయర్ నుండి చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం వరకు మూడు రోజుల వరకు జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు.
నల్లగొండ జిల్లా అన్యాయం జరిగితే సహించేది లేదు: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా జరిగే నీటి పంపకాల విషయంలో నల్లగొండ జిల్లాకు అన్యం జరిగితే సహించే ప్రసక్తి లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వానికి హెచ్చరించారు. మునుగోడు ప్రాంతం వెనకబడడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఐదు సంవత్సరాలు శివన్నగూడ రిజర్వాయర్ పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ 10 సంవత్సరాల రిజర్వాయర్ కంప్లీట్ చేయలేదని పేర్కొన్నారు. రైతు ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతుల పట్ల సానుభూతి చూపటం లేదని ఏనాడైనా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యలపై చర్చించారా అని ప్రశ్నించారు.
అసంపూర్తిగా ఉన్న శివన్నగూడ రిజర్వాయర్ త్వరగా పూర్తిచేయాలని అదేవిధంగా రాచకొండ ఎత్తుకు పోతల పథకం ఏర్పాటుచేసి మునుగోడు దేవరకొండ నియోజకవర్గం తాగు సాగునీరు అందించి అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుంటూరు శ్రీనివాసచారి, బూరుగు కృష్ణారెడ్డి, మాటూరు బాలరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, దొంతగాని పెద్దలు, మునుగోడు డివిజన్ మాజీ కార్యదర్శి దోనూరు నర్సిరెడ్డి, చండూరు డివిజన్ మాజీ కార్యదర్శి సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి, మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, నాంపల్లి చంద్రమౌళి, చింతకాయల నరసింహ, పిట్టె రాములు, ఆయా మండలాల మండల నాయకులు మండల కార్యదర్శి కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)