- అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన కౌన్సిలర్ ఉదయ జ్యోతి–ప్రసాద్ రావు
- పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలోని శ్రీ వనదుర్గాంబిక అమ్మవారి మహా వనసమారాధన ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. పచ్చని ప్రకృతి ఒడిలో కొలువుదీరిన అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ వేడుకకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ ఉదయ జ్యోతి–ప్రసాద్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యవరపు సంపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.





కామెంట్‌లు (0)