Magazines

ప్రజల ప్రాణ భద్రతకే తొలి ప్రాధాన్యం

38 నిమిషాల క్రితం

Top priority is given to the safety of people's lives.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- భారీ వర్షాలపై అప్రమత్తతకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే లు పిలుపు 

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రస్తుత ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసరంగా బయటకు వెళ్లవద్దని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.


రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తత సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని పేర్కొన్నారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.


ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని మెచ్చా నాగేశ్వరరావు కోరారు. అలాగే నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉంటూ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్