- విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే
- ఒక పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్లే టీచర్లు
నవతెలంగాణ - అశ్వారావుపేట
దసరా, మురసు తుఫాను, దీపావళి సెలవులు వరుసగా రావడంతో గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు సోమవారం అంతంత మాత్రంగానే కనిపించింది. వరుస సెలవుల ప్రభావం నుంచి విద్యార్థులు ఇంకా పూర్తిస్థాయిలో బయటపడలేదనే పరిస్థితి పలు పాఠశాలల్లో కనిపించింది. సోమవారం 'నవతెలంగాణ' పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరుపై ఆరా తీసింది. కొన్ని పాఠశాలల్లో సగానికి పైగా విద్యార్థులు హాజరుకాగా, మరికొన్ని పాఠశాలల్లో హాజరు శాతం తగ్గినట్లు వెల్లడైంది.
మండలంలోని ఎంపీయూపీఎస్ ఊట్లపల్లి పాఠశాలలో మొత్తం 120 మంది విద్యార్థులకు గాను 78 మంది హాజరైనట్లు ప్రధానోపాధ్యాయులు కిషిందర్రెడ్డి తెలిపారు.ఎంపీపీఎస్ వినాయకపురం లో 107 మందికి 65 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.
అలాగే ఎంపీయూపీఎస్ ఆసుపాక లో 197 మంది విద్యార్థులకు గాను 140 మంది హాజరయ్యారు. ఎంపీపీఎస్ ఆసుపాక కాలనీ లో 35 మందికి 32 మంది హాజరైనట్లు ప్రధానోపాధ్యాయులు చలమారావు తెలిపారు.ఎంపీయూపీఎస్ నందిపాడు లో 125 మంది విద్యార్థులకు గాను 102 మంది హాజరైనట్లు హెచ్ఎం కృష్ణారావు తెలిపారు.
ఇన్‌స్ట్రక్టర్లే ఉపాధ్యాయులు..!
మండలంలోని ఎంపీయూపీఎస్ కుడుములుపాడు పాఠశాలలో సోమవారం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంగణంలో ప్రాథమిక, పూర్వ ప్రాథమిక పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 31 మంది, పూర్వ ప్రాథమిక పాఠశాలలో 8 మంది కలిపి మొత్తం 39 మంది విద్యార్థులు ఉన్నారు.ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ, ఒకరు మెడికల్ లీవ్‌లో ఉండగా, మరొక ఉపాధ్యాయుడు కార్యాలయ పనిపై మండల కేంద్రానికి వెళ్లినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. దీంతో ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో సోమవారం విద్యార్థుల బోధన బాధ్యతలను ఇన్‌స్ట్రక్టర్లే నిర్వహించినట్లు తెలిసింది.
వరుస సెలవుల అనంతరం పాఠశాలలకు విద్యార్థుల హాజరును పూర్తిస్థాయిలో పెంచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.







కామెంట్లు (0)