ఎస్సై రమేష్ బాబు రక్తదానం అభినందనీయ
రక్తదానకి ముందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు
కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ
నవతెలంగాణ- నెల్లికుదురు
రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ అన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 5వ రోజున బుధవారం నాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్.ఈసం నారాయణ, స్థానిక ఎస్సై చిర్రా రమేష్ బాబు, కళాశాల ప్రిన్సిపల్ ఎ. శ్రీనివాసరెడ్డి లు హాజరై మాట్లాడుతూ రక్తదానం అనేది కేవలం సేవ కాదు, సమాజానికి ఇచ్చే గొప్ప కానుకని, ఆస్పత్రుల్లో ప్రమాదాలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు వంటి సందర్భాల్లో రక్తం అత్యవసరం అవుతుందని, ఒక్క బాటిల్ రక్తం ద్వారా మూడు ప్రాణాలను రక్షించవచ్చని అన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాభావాన్ని పెంపొందిస్తాయని, రక్తదానం ద్వారా ఇతరుల ప్రాణాలను రక్షించగలరన్న ఆత్మసంతృప్తి ప్రతి రక్తదాతకు లభిస్తుందని అన్నారు. వాలంటీర్లు సేవా భావాన్ని ఆచరణలో చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. రక్తదానం వల్ల దాత ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని, దానికి బదులుగా శరీరంలో కొత్త రక్తకణాల ఉత్పత్తి వేగవంతమవుతుందని, రక్తహీనత, గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని, 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సురక్షితంగా రక్తదానం చేయవచ్చని అన్నారు. సమాజంలో రక్తదానం గురించి ఉన్న అపోహలు తొలగించడం అత్యవసరం అన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరగాలని, వాలంటీర్లు సమాజానికి అవసరమైన సేవలలో ముందుండి పనిచేయడం అభినందనీయమని, యువత రక్తదానం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం వల్ల సమాజంలో మానవత్వం పెరుగుతుందని అన్నారు. అనంతరం వాలంటీర్లు రక్తదానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. “రక్తదానం – మహాదానం”, “మీ రక్తం ఎవరికో ప్రాణదానం” వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కలిగించారు. వాలంటీర్లు రక్తదాతలకు సహాయం చేస్తూ సేవా స్పూర్తిని ప్రదర్శించారు. సుమారు 40 యూనిట్ల రక్తాన్ని బ్లడ్ బ్యాంకు కు అందించారు. రక్తదాన శిబిరం విజయవంతం కావడం పట్ల గ్రామ ప్రముఖులు కాసం లక్ష్మా రెడ్డి, ఆకుతోట సతీష్, రావుల సతీష్, బాబు రావు లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ను, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, ఆకుతోట సతీష్, రావుల సతీష్, బాబురావు, బండి శ్రీను, భరత్, కిషోర్, నవీన్, యుగేందర్, మధు, యాకయ్య, రాము, దిలీప్, సురేష్ తదితరులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కాసం లక్ష్మారెడ్డి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేవేందర్, గుంశావళి, కల్పన, శ్రావణి, అక్షిత, సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.