Sunday, February 1, 2026
E-PAPER
Homeదర్వాజపొడవని పొద్దు

పొడవని పొద్దు

- Advertisement -

మతి పటమై
చింత మటమై
ఎటు పోతివే ఎల్లా
సడి లేదు
గిరిక తిరిగిన సప్పుడు లేదు
పిట్ట కీసు మంట లేదు
గరక మీద మిడత ఎగరలేదు

గాట్ల గడ్డిని పసరం ముట్టలేదు
ఊరు నిలబడ్డట్టుందే
ఆకిలి అల్లాడింది, తాటి పోరక తల్లడిల్లింది
పొగ లేక పొయ్యి సెగ లేక ఒత్తు
ఇల్లు ఇదారం పొయ్యి బుధారం
పొడవని పొద్దు సుట్టకుదురు
సూరు కింద పిట్టలు పొదిగిన కాలాన్ని
కాకి ముట్టి పోయిన కల వచ్చిందా
దిగ్గున లేచి దిగులు పడ్డావా ఎల్లా
ఊరబిష్క ఊరంతా తిరిగొచ్చి ఉసురుమందా

కలి లేక, కల్లం కాక కలిమేడిది
కాలం కాగులోకి చూడలే
ఏదీ లేక ఏటు దోయక గూడు పెట్టుకున్న దిగులు
గల్మాపూదిచ్చుకోలే
ఎన్ని దేవుండ్ల చుట్టూ ఎదని దిప్పినవే ఎల్లా
పాదులల్ల పాణం కదిలింది
వాగులల్ల చాపలీదే, పైన పక్షులు ఎగురుతున్నయి
కండ్లతో గాలించి గాలించి కాలమంతా వెతుకుతున్నవ్‌
మతిల నీడలే నిండు మనిషి కనిపించక
అడుగులెరిగి కండ్లకుద్దుకున్నవా

ఎదజీల్చే ఏలికను ఎన్నుకున్నవా ఎల్లా
ఉన్నది ఉన్నట్టు అంటే ఎక్క ఎలగదు ఎలుగు రాదు
సమరు అద్దిన జెండాలకు నెనరుండదు
కష్టం కాష్టం పేర్చుకుంటుంటే
మాటలు మూటలు కట్టుకుంటున్నయి
ఎడ్డి లోకం ఎద్దు కష్టం, ఊ కొడితేనే ఉంటావు
అడుగుతే ఆవుసు ఉండదు
గడియారం మన దిక్కు తిరగదు ఎల్లా
ఓట్లేసిన నాట్లేసిన కాట్లకేనాయే
కార్తి గూట్లెదీపమో తలాపున దీపమో
తలరాత చదివినోడెవడు
ఎగిరిపోయిన పచ్చులు తిరిగి వస్తాయా
చెట్టు పుట్ట చెర పడ్డదే
గడిగట్టుకొని మడిగట్టుకొని దడిగట్టుకున్నరే
కాన రాని బొడ్డు పేగుకు పొరబోయిందా

అలికిడైతే ఆశ ఆకాశమైందా
లోకం వినని లోన కొలుపుకు
పేరు తెలవని పచ్చి శిగమూగిందా
కనబడని వినబడని బొడ్డు పేగు
కండ్లల్ల తిరిగిందా ఎల్లా
ముసలోని మూలుగు లేదు
నులుకమంచానికి నూకలు చెల్లినయా
గంటీల అలికిడి లేదు నిశ్శబ్దం నీడల్ని పొదిగిందా ఎల్లా
దరి లేక దారి లేక పగలు రేత్రి పగబట్టినయే

దుఃఖం ఇంకిపోయి కన్నీళ్ల కరువు వచ్చిందా ఎల్లా
పైతాలు ఇయ్యబోయినవా సైదులకు
పెద్దగట్టా చెరువుగట్టా చెప్పే ఎల్లా ఏడికి పోతివి
అంతరం అంజనమై నీ ప్రాణం కనబడ్డదా
ఎక్కిళ్ళల్ల ఎదురొచ్చిండా కాలానికి కొత్త కార్తి అయిండా
ఏ దిక్కుకు దీవండ్లు ఇచ్చిపోయిండో
పొద్దు పోయింది వెన్నెల తారాడుతుంది
కనురెప్పల మీద కాలం బరువు పడ్డది.

మునాసు వెంకట్‌, 9948158163

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -