Wednesday, May 7, 2025
Homeఎడిట్ పేజిఅనారోగ్యాన్ని'కొని' తెచ్చుకోవద్దు!

అనారోగ్యాన్ని’కొని’ తెచ్చుకోవద్దు!

- Advertisement -

మండు వేసవికాలం. రంగురంగుల మామిడి పండ్లతో మార్కెట్లు కళకళలాడు తుంటాయి. ”పళ్లల్లో రారాజు” అని ముద్దుగా పిలుచుకునే ఈపండు కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే, ఈమధ్యకాలంలో ”అంతా మాయాబజార్‌” అన్న చందంగా, సహజ సిద్ధంగా కాకుండా కృత్రిమ పద్ధతుల్లో మామిడి పండ్లను త్వరగా పండించేస్తున్నారు. ఇలాంటి ”పైపూతలు” పూసిన పండ్ల వల్ల ప్రజల ఆరోగ్యం ఆగమవుతున్నదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌కు వచ్చిన మామిడి పండ్లు మంచివా? లేదంటే కృత్రిమంగా పండించినవా? వాటిని ఎలా గుర్తించాలన్న విషయంలో ప్రజలకు సరైన అవగాహన లేదు. దీంతో అనారోగ్యాన్ని ‘కొని’తెచ్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగనపల్లి, నీలం, రసం, తోతాపురి, బేనిషన్‌ వంటి రకాలకు మంచి పేరుంది. కానీ, నాసిరకం పండ్లను గుర్తించక అనారోగ్యం బారినపడుతున్నారు.
మామిడి కాయలను ”నిమిషాల్లో నిప్పులు కక్కేలా” పండించడానికి వ్యాపారులు ఎక్కువగా వాడుతున్న రసాయనం కార్బైడ్‌, దీనినే కాల్షియం కార్బైడ్‌ అని కూడా అంటారు. ఇది చూడటానికి పైకి మెత్తగా లోపల వెన్నపూస అన్నట్లు తెల్లగా లేదా బూడిద రంగులో ఉంటుంది. ఈ కార్బైడ్‌ను మామిడి కాయల మధ్యలో పెట్టి నీళ్లు చల్లితే చాలు, అగ్గి రాజుకున్నట్టు ఎసిటిలీన్‌ అనే వాయువు విడుదలవుతుంది. ఇది సహజంగా పండ్లు పండడానికి కారణమయ్యే ఇథిలీన్‌ వాయువును పోలి ఉన్నప్పటికీ, అసలు సిసలైంది కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొంతమంది వ్యాపారులు తక్కువ ఖర్చు ఎక్కువ లాభం అనే సూత్రంతో నిషేధిత రసాయనమైన ఇథిఫోన్‌ను కూడా అధిక మోతాదులో వాడుతున్నారు. ఈ రసాయనాన్ని మామిడి పండ్లు ముగ్గేందుకు ప్రత్యక్షంగా ఉపయోగిం చడానికి అనుమతి లేదు. ఇది కూడా ఇథిలీన్‌ను విడుదల చేస్తుంది, కానీ దీని అధిక వినియోగం పండ్ల నాణ్యతనుమట్టి కొట్టేలా చేస్తుంది, ఆరోగ్యానికి ‘చేటు చేస్తుంది. ఇథిఫోన్‌ను పొడి రూపంలో చిన్న సాచెట్‌లలో ప్యాక్‌ చేసి పండ్లతో నేరుగా సంబంధం లేకుండా ఉపయోగించవచ్చు. ఈ సాచెట్‌లు ఇథిలీన్‌ గ్యాస్‌ను విడుదల చేస్తాయి. తద్వారా పండ్లు పండుతాయి. అయితే, ఇథిఫోన్‌ను నేరుగా పండ్లపై చల్లడం లేదా అధిక మోతాదులో ఉపయోగించడం ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) నిబంధనలకు విరుద్ధం. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ చట్టాల ప్రకారం కాకుండా విరుద్ధంగా వీటిని వాడితే ”మూల్యం చెల్లించక తప్పదు”. ఈ విషయంలో కోర్టులు కూడా కాల్షియం కార్బైడ్‌ వాడకాన్ని తీవ్రంగా పరిగణించాయి. ఢిల్లీ హైకోర్టు దీన్ని విషం ఇవ్వడం తో సమానమని ”తీర్పు చెప్పింది”. ఇతర రాష్ట్రాల కోర్టులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాయి.
కార్బైడ్‌, ఇథిఫోన్‌ వంటివాటితో పండించిన మామిడి పండ్లను తింటే ఆరోగ్యం గుల్లనే అవుతుంది. కార్బైడ్‌లో ఆర్సెనిక్‌, ఫాస్పరస్‌ వంటి విషపు కుంపట్లు ఉంటాయి. వీటి ప్రభావంతో తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, వాంతులు, కడుపు నొప్పి, అతిసారం వంటి సమ స్యలు చుట్టుముడతాయి. దీర్ఘకాలికంగా ఇది నాడీ వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉంది. గర్భిణులు, పిల్లలపై దీని ప్రభావం ఉంటుంది. ఇంకా చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపులో మంట వంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇది కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.దీన్ని గుర్తించేదెలా?అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. సహజంగా పండిన పండ్లు ఒకే రంగులా ఉండదు, అక్కడక్కడ కొద్దిగా ఆకుపచ్చగా ఉంటాయి. కృత్రిమంగా పండించినవి మాత్రం మెరుగు పెట్టినట్టు ఒకే రంగులో మెరిసిపోతుం టాయి. సహజ పండ్లకు నోరూరించే తీయటి వాసన ఉంటుంది, కానీ వీటికి అంత వాసన ఉండదు, లేదా రసాయనాల ముక్కు చీదుకునే వాసన వస్తుంది. సహజ పండ్లు మెత్తగా ఉంటే, కృతిమపండ్లు పైకి మెత్తగా ఉన్నా లోపల రాయిలా గట్టిగా ఉంటాయి. కొన్నిసార్లు వాటిపై నల్లటి మచ్చలు కూడా కనిపిస్తాయి.రుచిలో కూడా తేడా ఉంటుంది, సహజ పండ్లు పూర్తిగా తియ్యగా ఉంటే, వీటికి రుచి అంతగా ఉండదు లేదా పుల్లగా అనిపించవచ్చు. ఒకవేళ మీరు పొర పాటున ఇలాంటి పండ్లను కొంటే, వాటిపై ఉండే రసాయనాలను కొంత వరకు తగ్గించడానికి నీటితో బాగా కడగడం, ఉప్పు నీటిలో, వెనిగర్‌ లేదా బేకింగ్‌ సోడా ద్రావణంలో నానబెట్టడం వల్ల ఉపరి తలంపై ఉండే రసాయనాలు కొంత వరకు పనిచేస్తా యి. కానీ పూర్తిగా తొలగించలేమన్నది గుర్తుంచు కోవాలి. అధికారులు కూడా కృత్రిమపండ్లు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మార్కెట్లలో విరివిగా నాణ్యత పరీక్షలు చేయాలి.ప్రజలకు కూడా సరైన అవగాహన కల్పించాలి. ఇది ప్రభుత్వాల బాధ్యతగా భావించాలి.
-జనక మోహన రావు , 8247045230

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -