త్రిభాషా సూత్రంపై కమల్ మండిపాటు
చెన్నై : రాజ్యసభ సభ్యుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్ హసన్ తమిళనాడు రాష్ట్ర విద్యా విధానాన్ని (ఎస్‌ఈపీ) సమర్ధించారు. విద్యను ఉమ్మడి జాబితా నుంచి తొలగించి తిరిగి రాష్ట్ర జాబితాలో చేర్చాలని ఆయన సూచించారు. ‘విద్య రాష్ట్ర జాబితాలోనే ఉండాలి. ఇది గతాన్ని నిందించడం కాదు. వర్తమానం, భవిష్యత్తు గురించి ఆలోచించడం. సహకార ఫెడరలిజం వైపు కేంద్రం నిజంగా నిలబడి ఉంటే విద్యతోనే మొదలు పెట్టాలి. ప్రజలను, సంస్కృతిని, క్షేత్ర స్థాయి వాస్తవాలను రాష్ట్రాలే బాగా అర్థం చేసుకుంటాయి’ అని చెప్పారు. భాషను బలవంతంగా రుద్దడాన్ని నివారించాలని అంటూ భాష అనేది కేవలం మాధ్యమం మాత్రమేనని, అది విద్య కోసం కాదని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టిన రాష్ట్ర విద్యా విధానాన్ని కమల్ సమర్ధించారు. కేవలం ద్విభాషా సూత్రాన్నే (తమిళం, ఆంగ్లం) ఈ విధానం అనుసరిస్తుందని ఆయన చెప్పారు. మాతృభాష, ఆంగ్లం, మరో భారతీయ భాషతో కూడిన త్రిభాషా సూత్రాన్ని నిర్దేశించిన 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) కమల్ వ్యతిరేకించారు. విద్యార్థులు రెండు భాషల్లో నిష్ణాతులు కావాలని, అవసరమైన పక్షంలో ఇతర భాషలు నేర్చుకోవచ్చునని తెలిపారు. పాఠ్య ప్రణాళికలు విద్యార్థులపై తక్కువ భారం మోపేవిగా ఉండాలని సూచించారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా విద్యార్థులు విద్యను అభ్యసించాలని అన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలిగించవద్దని కమల్ కోరారు.