2026-27 ఆర్థిక సంవత్సరానికి 96 వేల పనిదినాలు..
ముగిసిన పనుల గుర్తింపు గ్రామసభలు..
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2026-27 ఆర్థిక సం వత్సరానికి మండలంలో ఉపాధి కూలీలకు 96 వేల పనిదినాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రణాళికలు తయారు చేసి అధికారులు ముందుకు సాగుతున్నారు. అక్టోబర్ చివరి వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పనులు గుర్తింపు పూర్తిచేశారు. ఈజీఎస్ అధికారులు ప్రజలు ఎలాంటి పనులు కోరుకుంటున్నారనే నివేదికను జిల్లా అధికారులకు అందించేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించి ఆదుకోవాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ వెంటనే జాబ్ కార్డులు అందిస్తున్నారు.
దీంతో వ్యవసాయ కూలీలతో పాటు సాధారణ కూలీలు, నిరుపేదలు సైతం ఉపాధి పొందనున్నారు.రోజు రూ.307 కూలి చెల్లిస్తుండటంతో జాబ్ కార్డు ఉన్న కుటుంబాలు మూకుమ్మడిగా 260 రకాల పనుల్లో పాల్గొంటూ ఉపాధి పొందుతున్నారని ఏపీఓ హరీష్ వెల్లడించారు. రోజు ఉదయం, సాయంత్రం కూలీల వివరాలతో పాటు చేసిన పని ఆన్లై న్లో నమోదు చేస్తుండటంతో అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయిందని పలువురు తెలిపారు. గతంలో మస్టర్ ప్రకారం హాజరు ఉండేదని,దీంతో ఉదయం పనిచేసి మధ్యాహ్నం హాజరుగాక పోయినా రోజంతా పని చేసినట్లుగా ధ్రువీకరించే అవకాశం ఉండేదని, ఇప్పుడు అది సాధ్యం కాకపోవడంతో కూలీలు విధిగా పనుల్లో పాల్గొంటున్నారు. మండలంలో మొత్తం జాబ్ కార్డులు 8,495,మొత్తం కూలీలు సంఖ్య 18873,యాక్టివ్ కూలీలు సంఖ్య 10,632 ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కరు మాత్రమే 100 రోజుల పని పూర్తి చేశారు.
1,71,69 లక్షల చెల్లింపులు ఇలా…
మండలంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ కూలీల 90 వేలు పనిదినాలను లక్ష్యంగా పెట్టుకొని 77,708 పనిదినాలు 80.53 శాతం కల్పించారు. జాబ్ కార్డులున్న 5.362 కూలీలు పనులకు హాజరయ్యారు. కూలికి రూ.307 చొప్పున ఇప్పటికే రూ.1కోటి 71 లక్షల 69 వేలు చెల్లించినట్లుగా ఈజిఎస్ ఎపిఓ హరీష్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారుగా రూ.2 కోట్ల విలువైన పనులు జరగవచ్చనే అంచనాలో ఉన్నారు.



