– నలుగురు మావోయిస్టులు మృతి
– మరో ఇద్దరి అరెస్ట్
రాంచీ : జార్ఖండ్‌లోని ఛైబాసాలో భద్రతా దళాలతో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఓ మహిళ సహా నలుగురు మావోయిస్టులు మరణిం చారు. మరో ఇద్దరు అరెస్టయ్యారు. చనిపోయిన మావోయిస్టుల్లో ఒక జోనల్ కమాండర్, ఒక సబ్-జోనల్ కమాండర్ ఉన్నారు. ఛైబాసా (పశ్చిమ సింఫ్‌ుభుమ్)లోని కొల్హాన్ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఉదయం ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయని, ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. మావోయిస్టుల మృతిని ఛైబాసా ఎస్పీ అశుతోష్ శేఖర్ ధృవీకరించారు.
‘ఎన్కౌంటర్లో చనిపోయిన నలుగురు మావోయిస్టుల్లో ఒకరు జోనల్ కమాండర్. మరొకరు సబ్-జోనల్ కమాండర్. ఇంకొకరు ఏరియా కమాండర్. మిగిలిన మావోయిస్టు మహిళ’ అని ఎస్పీ వివరించారు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఇద్దరు మావోయిస్టులను భద్రతా దళాలు పట్టుకున్నాయని, వారిలో ఒకరు ఏరియా కమాండర్ కాగా రెండో వ్యక్తి కరడుకట్టిన మహిళా మావోయిస్టు అని చెప్పారు. సంఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు, రోజువారీగా ఉపయోగించే కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
గువా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు జరుపుతుండగా ఓ పొదలో కూర్చున్న మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారని, భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా సంఘటనా స్థలం నుండి దట్టమైన అడవుల్లోకి పరారైన మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో కొందరు మావోయిస్టులకు బులెట్ గాయాలైనట్లు తెలుస్తోంది. పశ్చిమ సింఫ్‌ుభుమ్ జిల్లాలోని సరందా అటవీ ప్రాంతం మావోయిస్టుల కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉంటోంది. అక్కడ భద్రతా దళాలు నిరంతరం గాలింపు చర్యలు జరుపుతుంటాయి. వారం రోజుల క్రితం కూడా ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.