Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅప్పుడు గాంధీని.. ఇప్పుడు ఆయన పేరునూ..

అప్పుడు గాంధీని.. ఇప్పుడు ఆయన పేరునూ..

- Advertisement -

– ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్‌కు బీజేపీకి కౌంటర్‌
– శాసనసభలో ఆ పార్టీ పక్షనేత ఏలేటీ, మంత్రి సీతక్క మధ్య వాగ్వాదం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌జీఏ) పేరు మార్పుపై శాసనసభలో మహిళా, శిశుసంక్షేమం, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) భారతీయ జనతా పార్టీపై మండిపడ్డారు. ‘ఒంటిపై బట్ట లేకుండా, నిస్వార్థంగా దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామి చట్టం నుంచి తొలగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారి చేతిలో గాంధీ చంపబడ్డారు. గాంధీ హంతకుడు గాడ్సే ఆరాధకుల నుంచి ఇంతకంటే ఏం ఆశించ గలమని’ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ప్రసంగిస్తుండగా.. మధ్యలో జోక్యం చేసుకున్న మంత్రి సీతక్క.. పలు అంశాలపై స్పందించారు.

‘ఈ రోజు సభలో బిమార్‌ (బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌) గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఆ పథకం తీసుకొచ్చారు. ఎంఎన్‌ఆర్‌జీఏ పథకం తీసుకొచ్చి 20 ఏండ్లు అవుతోంది. పథకాల పేర్లు మార్పు చేసే బిజెపి.. ప్రతిపక్ష రాష్ట్రాలకు ఆదాయం చేకూర్చే ఆలోచనలు మాత్రం చేయటం లేదు. కాలానుగుణంగా ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేయాలి. ఒంటిపై బట్ట కూడా లేకుండా, నిస్వార్థంతో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారి చేతిలో చంపబడిన గాంధీ పేరును తొలగిస్తారా? గాంధీ హంతకుడు గాడ్సే ఆరాధకుల నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన పటేల్‌ను ఆరాధిస్తున్నారు. కానీ, గుజరాత్‌కే చెందిన గాంధీని తిడుతున్నారు. పటేల్‌ కూడా కాంగ్రెస్‌ సిద్దాంతంతోనే పని చేశారు. బిజెపి ఎందుకు ఈ విభజన తీసుకొచ్చేందుకు చూస్తుంది?. ఆపార్టీకి (బిజెపి) చరిత్రలో చరిత్రే లేదు. మా (కాంగ్రెస్‌) చరిత్రను కనుమరుగు చేయాలని అనుకోవటమే కాకుండా, స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన వారి పేర్లను కూడా తొలగిస్తున్నారు. ఈ విధానం తప్పు. గాడ్సేకు నివాళులు ఆర్పిస్తున్నారు, గొప్ప పోరాట యోధుడు అంటున్నారు. గాంధీని చంపిన గాడ్సేను పొగడటం ఎంతవరకు సబబు?’ అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌ సైతం ఈ చర్చలో కలుగజేసుకుని బిజెపికి చురకలు అంటించారు. ఆ పార్టీ మత రాజకీయాలు చేయటం మానుకోవాలని, ఓట్లేసి ఎన్నుకున్న తెలంగాణ ప్రజలకు మేలు చేసే అంశాలపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు.

‘2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో కొనసాగుతున్న బిజెపి ప్రభుత్వం సామాజిక, వృద్దాప్య పింఛన్లు ఒక్క రూపాయి పెంచలేదు. దివ్యాంగులకు రూ.300, వితంతులకు రూ.200 పెన్షన్లు మాత్రమే కేంద్రం ఇస్తోంది. వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత బిజెపికి లేదు. రైతులను ఇబ్బందులకు గురి చేసేందుకు నల్ల చట్టాలను తీసుకొస్తే, రాహుల్‌ గాంధీ పోరాటంతో వెనక్కి తీసుకున్నారు. కార్పోరేట్లకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. కానీ రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేదు. సబ్సీడీలు ఇస్తే రైతులు సోమరులు అవుతారనే భావజాలం వారిది. 2014 తర్వాత కొత్తగా కేంద్రం చేసిందేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే సామాజిక పెన్షన్లను పెంచుతూ వస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి కేంద్రం తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో 100 రోజులు, 100 శాతం కేంద్రమే ఉపాధి కల్పించేది. ఇప్పుడు పని దినాలను 125 రోజులకు పెంచుతూ.. 60 శాతం నిధులను కేంద్రం, 40 నిధులు రాష్ట్రాలు భరించాలని నిబంధన పెట్టింది. దీంతో కేంద్రం సుమారు 75 రోజులు మాత్రమే ఉపాధి కల్పిస్తోంది. మన ఇంట్లో వంటకు వాళ్ల అనుమతి ఎందుకు?. గతంలో ఉపాధి పథకంలో 266 పనులను అవకాశం ఉండేది. ఇప్పుడు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. అభివృద్దికి ఆటంకం కలిగిస్తున్నాయి. పేదలకు ఇబ్బందులకు కలుగుతున్నాయి. కాబట్టి అందులో మార్పులు తీసుకురావాలని కోరుతున్నాను. రాష్ట్రం నుంచి ఒక్క ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేదు. 2014 నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రం బడ్జెట్‌లో ఎవరికీ కేటాయింపులు తగ్గించలేదు. ప్రతి వర్గానికి పెంచుకుంటూ వెళ్తున్నాం. మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించాం. రూ.1300 కోట్లు వడ్డీ మహిళల ఖాతాల్లో జమ చేశాం. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ రూ.2500 కోట్లు వడ్డీ రహిత రుణాల కోసం కేటాయించామని’ సీతక్క స్పష్టం చేశారు.

మాది ప్రజారంజక బడ్జెట్‌ : ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ‘గత ప్రభుత్వం పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. అప్పులను తీర్చుకుంటూ, అభివృద్ది పథంలో నడిపిస్తూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమిగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఓ విజన్‌తో ముందుకెళ్తున్నారు. గత ప్రభుత్వం స్కీమ్‌ల పేరిటి అన్నింటా స్కామ్‌లు చేసిందని, ప్రాజెక్టుల అంచనాలను పెంచేసి రూ.70-80 వేల కోట్ల ప్రజాధనం వృథా చేశారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -