రూ.3393కి చేరిన వాణిజ్య సిలిండర్ ధర
వీధిన పడనున్న చిరువ్యాపారులు
ఇద్దరు చేసేపని ఒక్కరితోనే..
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
వాణిజ్య సిలిండర్ ధర పెంపువల్ల ఎంతోమంది ఉపాధికి దూరం కాబోతున్నారు. ఏకంగా రూ.993 పెంచడంతో చిరువ్యాపారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే గ్యాస్ సరఫరా లేక బ్లాక్‌లో కొనుగోలు చేస్తూ వ్యాపారం చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న ఎంతోమందికి చిరు వ్యాపారులకు మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. సిలిండర్‌పై ఏకంగా వెయ్యి రూపాయల వరకు పెంచడంతో ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య సిలిండర్ ధర రూ.3393కు చేరడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. టీ, టిఫిన్ సెంటర్‌లు, ఫాస్ట్‌ఫుడ్స్, చిన్న హౌటల్స్‌తో పాటు ఇతర చిరు వ్యాపారాలు చేసుకునే కుటుంబాలు వీధినపడే పరిస్థితి నెలకొంది. దీంతో పాటు అందులో పని చేసే వారి ఉపాధిపై సైతం తీవ్ర ప్రభావం చూపనుంది. గ్యాస్ ధర పెరగడంతో వ్యాపారాన్నే ఆధారం చేసుకుని జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి కడుదయనీయం కానుంది. ఇద్దరు పని చేయాల్సిన చోట ఒకరితో చేయిస్తే.. మరొకరు ఉపాధి కోల్పోయి తిప్పలు పడాల్సిందే.
యుద్ధం ప్రభావంతో వంట నూనెతో పాటు నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతుంది. దీనికి తోడు ఎల్‌పీజీ సప్లరు తగ్గడంతో చిరువ్యాపారులు తల్లడిల్లుతున్నారు. ఇప్పుడు భారీగా గ్యాస్ ధర పెరగడంతో చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు మానేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆహార పదార్ధాల రేట్లను పెంచినా వచ్చిన ఆదాయం సిలిండర్‌కే పెట్టాల్సి వస్తోందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.37 లక్షల్లో నమోదిత వీధి వ్యాపారులు ఉన్నారు. అనధికారికంగా చాలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4,96,999 కుటుంబాలు ఉండగా, కామారెడ్డి జిల్లాలో 3,11,922 కుటుంబాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 20 శాతం కుటుంబాలు టీ, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్, మెస్ లాంటి చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాయి. వ్యాపారాలతో వారు ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు సైతం ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వారిపై.. ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది.
ధర పెరిగితే సామాన్యులు దూరం
గ్యాస్ ధరలు పెరిగినట్టు తమ టీ, టిఫిన్ ఇతరాత్ర ఉత్పత్తుల ధర పెంచితే సామాన్యులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపరు. దీంతో తమ ఉపాధికే ఎసరు పడుతుందని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులు కట్టెలతో నెట్టుకొచ్చినా ప్రస్తుతం వాటికి సైతం డిమాండ్ పెరగడంతో ధరలు అమాంతం పెరగడంతో పాటు సకాలంలో అందని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎలా తమ వ్యాపారాలు సాగించాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వాణిజ్య సిలిండర్‌ల ధరలు తగ్గించాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.
చిరువ్యాపారుల ఉపాధికి దెబ్బ :చంద్రశేఖర్. సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ పెంచడం లేదు కానీ కమర్షియల్ మాత్రమే పెంచుతున్నట్టు ప్రకటన చేయడమంటే ప్రజలను మోసం చేయడమే. ఒక వైపు చిరువ్యాపారుల ఉపాధిని దెబ్బకొట్టడంతో పాటు మరో వైపు సామాన్యులు బయట ఏమీ కొనుగోలు చేసి తినే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. యుద్ధం బూచీతో పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో ఉప్పు, పప్పుల మీద దాని ప్రభావం పడుతుంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ పూర్తవ్వగానే అవకాశంగా ధరలు పెంచారు.
ఐదు కుటుంబాలకు ఉపాధి : లింగం. లక్ష్మినర్సింహా టిఫిన్ సెంటర్. వినాయక్‌నగర్
మేము నడిపే టిఫిన్ సెంటర్‌తో మా కుటుంబంతో పాటు మరో నాలుగు కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఇలా గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతే.. మా ఐదు కుటుంబాలకు పని లేకుండా పోతోంది. మేము ఎలా బతకాలి..? గ్యాస్ ధరలకు అనుగుణంగా టిఫిన్ ధరలు పెంచితే కస్టమర్‌లు రారు. మా చిరు వ్యాపారుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతుంది. వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గించాలి.
గ్యాస్ ధర పెంపుతో ఉపాధిపై దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



