Monday, September 21, 2026
E-PAPER
Homeజాతీయంవేవ్స్‌ ఓటీటీలోరూ.3.87కోట్ల ‘గోల్‌మాల్‌’!

వేవ్స్‌ ఓటీటీలోరూ.3.87కోట్ల ‘గోల్‌మాల్‌’!

- Advertisement -

వ్యయ అంచనాల్లో రూ.75.11 లక్షల తేడా
పని అప్పగింతలో నిబంధనలకు తూట్లు?
ఎంపికైన సంస్థకు బదులు మరో ఏజెన్సీతో థంబ్‌నెయిల్స్‌ తయారీ
వర్క్‌ ఆర్డర్‌ లేకుండానే పనులు.. వ్యయ అంచనాల్లో రూ.75 లక్షల తేడా

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసార భారతి ప్రారంభించిన ‘వేవ్స్‌’ ఓటీటీ వేదికలో కంటెంట్‌ థంబ్‌నెయిల్స్‌, మెటాడేటా తయారీ వ్యవహారం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. రూ.3.87 కోట్ల విలువైన పనికి ఎంపిక చేసిన ఏజెన్సీకి బదులు మరో సంస్థ పనిచేసిందని పత్రాలు సూచిస్తున్నాయి. పనులు ప్రారంభించడానికి ముందు గానీ, పూర్తయిన తర్వాత గానీ అధికారిక వర్క్‌ ఆర్డర్‌ జారీ కాలేదని ఆ ఆంగ్ల వార్తా కథనం వెల్లడించింది. దీంతో వ్యయ అంచనాల్లో మార్పులు, ఆమోద ప్రక్రియ, కాంట్రాక్టు నిబంధనల అమలుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

న్యూఢిల్లీ : భారత ప్రభుత్వ ప్రజా ప్రసార సంస్థ ప్రసార భారతి ‘వేవ్స్‌’ ఓటీటీని 2024 నవంబర్‌లో ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫాంలోని కంటెంట్‌ను ప్రేక్షకులు సులభంగా గుర్తించేందుకు థంబ్‌నెయిల్స్‌, పోస్టర్లు, ఇన్ఫోగ్రాఫిక్స్‌, మెటాడేటా వంటి అనుబంధ కంటెంట్‌ను సిద్ధం చేయాల్సి వచ్చింది. ఈ పనుల కోసం సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ)లో నమోదైన ఐదు మల్టీమీడియా ఏజెన్సీలను ఎంపిక చేశారు. మొత్తం 21 ఏజెన్సీల జాబితా నుంచి వీటిని ఎంపిక చేశారు. ఈ పనులకు ప్రసార భారతి అంచనా వేసిన మొత్తం వ్యయం రూ.3.87 కోట్లు. ఇందులో దాదాపు 74 శాతం పనులు అంకుర్‌ మీడియా ప్రయివేట్‌ లిమిటెడ్‌కు కేటాయించారు. అయితే అంకుర్‌ మీడియాకు కేటాయించిన పనులను వాస్తవంగా విద్‌యూనిట్‌ అనే సంస్థ నిర్వహించింది. కానీ విద్‌యూనిట్‌ సీబీసీ మల్టీమీడియా ఏజెన్సీల జాబితాలో లేదు. అది ఆడియో-విజువల్‌ విభాగంలో మాత్రమే నమోదై ఉంది. అంతేకాకుండా.. ఈ పనులకు సంబంధించిన అధికారిక వర్క్‌ ఆర్డర్‌ ఇప్పటివరకు జారీ కాలేదు.

నిబంధనల నుంచి మినహాయింపా?
2024 అక్టోబర్‌ 3న జరిగిన ప్రసార భారతి మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశంలో ‘చైల్డ్‌ అసెట్స్‌’ తయారీకి సంబంధించిన నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను అప్పటి దూరదర్శన్‌ కంటెంట్‌ సోర్సింగ్‌ డైరెక్టర్‌ అమిత్‌ కుమార్‌ చేశారు. సాధారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కోసం కంటెంట్‌ను తయారు చేసే సంస్థలే దానికి సంబంధించిన మెటాడేటా, థంబ్‌నెయిల్స్‌ను అందిస్తాయి. అయితే, అవసరమైన ఫార్మాట్‌లో, నిర్ణీత గడువులో ఈ వివరాలను అందించలేకపోవడంతో నిబంధనల్లో సడలింపు కోరినట్టు తెలిసింది. ప్రసార భారతి కమిటీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అనంతరం పనుల వ్యయాన్ని అంచనా వేసి ఆమోదించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ఆ మినహాయింపు ఏ మేరకు వర్తించింది? దాని ఆధారంగా మరో సంస్థకు పని అప్పగించారా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు మాత్రం వెలువడలేదు.

రూ.2.30 కోట్ల నుంచి రూ.4.63 కోట్లకు అంచనా
గతేడాది జనవరి 19న ప్రసార భారతి కాంట్రాక్టు నిపుణురాలు ఉమా అయ్యర్‌ రావులా గతంలోనే పూర్తయిన పనులకు తదనంతర ఆమోదం కోరుతూ ఫైల్‌ సమర్పించారు. వేవ్స్‌ ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని చైల్డ్‌ అసెట్స్‌ ఇప్పటికే సీబీసీతో అనుబంధం ఉన్న మల్టీమీడియా ఏజెన్సీల ద్వారా రూపొందించబడ్డాయని ఆమెేర్కొన్నారు. సుమారు 5,000 టైటిళ్లకు సంబంధించిన పనుల వ్యయాన్ని రూ.2.30 కోట్లుగా అంచనా వేశారు. దీనికి జీఎస్టీ అదనం. గతేడాది జూన్‌ 8న సవరించిన అంచనాతో ఫైల్‌ మళ్లీ సమర్పించారు. ఈసారి వ్యయం రూ.4.63 కోట్లకు పెరిగింది.

‘టైపోగ్రాఫికల్‌ ఎర్రర్‌’ అంటూ వివరణ
మార్చి 11న ఉమా రావులా మళ్లీ ఫైల్‌ సమర్పించారు. వ్యయ అంచనాల్లో తేడాను ‘టైపోగ్రాఫికల్‌ ఎర్రర్‌’ (టైపింగ్‌ పొరపాటు)గా వివరించారు. అనంతరం ప్రసార భారతి ఏర్పాటు చేసిన కమిటీ ఏజెన్సీలు రూపొందించిన చైల్డ్‌ అసెట్స్‌ పరిమాణం, నాణ్యతను పరిశీలించింది. ఈ కమిటీలో పీవీ సెంట్రల్‌ ఆర్కైవ్స్‌ ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ మోనికా గులాటీ, ఉమా రావులా, వేవ్స్‌ ఓటీటీ కంటెంట్‌ మేనేజర్‌ ప్రాంజల్‌ మిశ్రా ఉన్నారు. ఉమా రావులాను కమిటీ కన్వీనర్‌గా నియమించారు. ఏప్రిల్‌ 21న సమావేశమై నివేదిక రూపొందించాలని కమిటీ నిర్ణయించింది. ఆ నివేదిక అనంతరం ఫైల్‌ను ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్స్‌ డివిజన్‌కు పంపి ఆర్థిక సమ్మతి పొందాలి. ఆ తర్వాత ఎక్స్‌ పోస్ట్‌ ఫ్యాక్టో ఆమోదం, చివరికి చెల్లింపు ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే కమిటీ సమావేశం జరిగినప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదు.

సబ్‌ కాంట్రాక్టింగ్‌ జరిగిందా?
ప్రసార భారతి వెబ్‌ ఆపరేషన్స్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ.. ఇది సబ్‌ కాంట్రాక్టింగ్‌ వ్యవహారమై ఉండవచ్చని, అది నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. అయితే ఇక్కడ ప్రధానంగా తేలాల్సిన అంశం ఏమిటంటే… అధికారికంగా ఎంపికైన సంస్థకు బదులుగా మరో సంస్థ పనులు నిర్వహించడానికి ఏ అనుమతి ఉంది? ఆ అనుమతి ఉంటే, దానికి సంబంధించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయి? అనేవే.

విద్‌యూనిట్‌ పేరు ఎప్పుడు వచ్చింది?
గతేడాది జూన్‌ 8న ఉమా రావులా ఇతర అధికారులకు పంపిన ఈమెయిల్‌లో ఏజెన్సీల వారీగా పనుల వివరాలు ఇచ్చారు. అంకుర్‌ మీడియా పేరుకు కింద విద్‌యూనిట్‌ పేరు కనిపించింది. దాదాపు ఏడు నెలల తర్వాత, ఈ ఏడాది మార్చి 21న ఐదు ఎంపిక చేసిన ఏజెన్సీలకు పనుల వివరాలు కోరుతూ పంపిన ఈమెయిల్‌లో విద్‌యూనిట్‌ను కూడా కాపీ చేశారు. అయితే, ఆ ఈమెయిల్‌కు అంకుర్‌ మీడియా కాకుండా విద్‌యూనిట్‌ స్పందించింది.

పారదర్శకతపై సందేహాలు
వేవ్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కోసం చేపట్టిన పనుల వ్యవహారం కేవలం వ్యయ అంచనాల తేడాతోనే పరిమితం కావడం లేదు. పని అప్పగింపు, ఏజెన్సీల ఎంపిక, అధికారిక అనుమతులు, వర్క్‌ ఆర్డర్ల జారీ, తదనంతర ఆమోదాల విషయంలోనూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజా ప్రసార సంస్థలో ప్రజాధనంతో చేపట్టే పనులకు స్పష్టమైన విధానాలు, నిర్ణయాలు, జవాబుదారీతనం అవసరం. అయితే, ఈ వ్యవహారంలో లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.

ప్రసార భారతి అధికారులపై ప్రశ్నలు
పనులు అప్పగించే ముందు ఆమోదాలు ఎందుకు పొందలేదు? వ్యయ అంచనాల్లో తేడా ఎలా ఏర్పడింది? విద్‌యూనిట్‌ ఏ ప్రాతిపదికన పని చేసింది? ఇప్పటికీ వర్క్‌ ఆర్డర్‌ ఎందుకు లేదు? అనే అంశాలపై ప్రసార భారతి నుంచి ఎలాంటి వివరణా లేదు. ఉమా రావులా మాత్రం తాను కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నానని, ఉన్నతాధికారుల సూచనలను మాత్రమే పాటిస్తానని, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో తనకు పాత్ర లేదని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -