విరామం ఎరుగక గొడ్డు కష్టం చేయాల్సిందే..
కార్మికులకు కడుపు లేదా.. ఆకలి ఉండదా..?
మోడీ తిండి కోసం రూ. లక్షలు ఎందుకు?
మోడీ, అమిత్‌షా.. ట్రంప్ కట్టు బానిసలు : సీఐటీయూ రాష్ట్ర ఉపాధక్షులు ఎస్. వీరయ్య
మోడీ అడుగుజాడలో రేవంత్‌రెడ్డి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్
కాటేదాన్‌లో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులతో వెట్టిచాకిరి చేయించేందుకు కుట్రలు పన్నుతూ నీతిమాలిన చర్యలకు పాల్పడుతుందని, ‘శ్రమ శక్తి నీతి’ పేరుతో కార్మికులను బానిసత్వంలోకి నెట్టేందుకు పూనుకుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కార్మికులు వేతనాలు అడగరని చెబుతున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు.. ఏమీ తిని బతుకుతున్నారని, గడ్డి తింటున్నారా అని ప్రశ్నించారు. కార్మికులకు కడుపు లేదా.. ఆకలి ఉండదా అని నిలదీశారు. పెట్టుబడిదారుల ఆకలి కోసం ఆలోచన చేస్తున్న పాలకులు శ్రామికుల ఆకలి కోసం ఎందుకు ఆలోచన చేయడం లేదన్నారు. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాటేదాన్ పారిశ్రామిక క్లస్టర్ ప్రాంతంలోని స్వప్న థియేటర్ ఎదుట భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ముందుగా సంఘం నాయకులు గుండె యాదయ్య చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్, ఉపాధ్యక్షులు భూపాల్‌తో కలిసి వీరయ్య పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్.రాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశ కార్మికులను ఐక్యం చేసి శ్రామికుల సమస్యలను పరిష్కారించేందుకు సీఐటీయూ పనిచేస్తోందన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం కార్మికులు ఐక్యం అయ్యేందుకు అవకాశం లేదు.. యూనియన్లు పెట్టుకునేందుకు వీలు లేదంటోదని తెలిపారు. కనీసం వేతనం అడిగితే పాలకులకు చిరాకుగా ఉందన్నారు. ‘శ్రామికులు గొడ్డుచాకిరి చేయాల్సిందే.. యాజమాన్యాలను ప్రశ్నించడానికి వీలు లేదు’ అనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకు వచ్చిందన్నారు.
దేశంలో కార్మికుల శ్రమకు ప్రత్యేకత లేదని, విదేశాల కార్మికుల శ్రమకు.. భారతీయ కార్మికుల శ్రమకు తేడా ఉందని, ఇక్కడ పని చేయడం ముఖ్యమని, వేతనాలు ముఖ్యం కాదని, కార్మికులకు పని ఆలోచన తప్ప మరోటి ఉండకూడదని, కార్మికులు ఇచ్చింది తీసుకోవాలని డిమాండ్ చేయకూడదని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు చెబుతున్న నీతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆకలి ఉండదని, డబ్బులు అడగరని చెబుతున్న మోడీ.. ఒక్క పూట తిండికి రూ.లక్షలు ఎందుకు ఖర్చు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ట్రంప్ కుట్రలు పన్నుతుంటే.. దేశాన్ని ట్రంప్‌నకు దాసోహం చేసేందుకు మోడీ రెడీ అయ్యారని అన్నారు. కమ్యూనిస్టుల కాలం చెల్లించిందని అంటున్న వారు ఒక్కసారి కండ్లు తెరిచి ప్రపంచం వైపు చూడాలన్నారు. ప్రపంచం సోషలిజం వైపు పరుగెడుతోందన్నారు. యువతరం సోషలిజం కోరుకుంటుందని.. అగ్రరాజ్యం అయిన అమెరికా రాజధాని న్యూయర్క్ మేయర్‌గా యువ సోషలిస్టు ఎన్నికయ్యారని తెలిపారు. భవిష్యత్ ఎర్రజెండాదే అనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేండ్లు కావొస్తున్నా ఇప్పటికీ కార్మికుల సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి.. మోడీ విధానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు. 10 గంటల పనివిధానంపై జీవో తీసుకువచ్చారని గుర్తు చేశారు. 72 రంగాల్లో వేతన సవరణ చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టంతా.. ‘రింగ్ రోడ్ల కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలి.. పెట్టుబడిదారుల కోసం పేదల నుంచి భూములు ఎలా లాక్కొవాలి’ అన్న దానిపైనే ఉంటున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా ధనిక జిల్లా అంటున్నారని.. నెల జీతం సుమారు రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనాలు వేసిందన్నారు.
కానీ మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఆశ, అంగన్‌వాడీల వేతనాలు రూ.10వేల నుంచి రూ.15 వేలకు మించి ఎందుకు లేవని ప్రశ్నించారు. వీరి వేతనాలను కూడా రూ.2లక్షలతో పోల్చితే ఎలా అని నిలదీశారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలో కార్మికుల సమస్యలపై సుధీర్ఘంగా చర్చ, భవిష్యత్ ఉద్యమాలకు కార్చచరణ ఉంటుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్ మాట్లాడుతూ.. దేశ సంపదకు మూలాలైన కార్మికులను బానిసలుగా చేసేందుకు కాషాయ నేతల నిర్ణయాలు ఉన్నాయన్నారు. దేశ కోసం, ధర్మం కోసం పనిచేస్తోంది మోడీ కాదని కార్మికులేనని స్పష్టం చేశారు. తాము కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతామన్నారు. ఈ సభలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్.చంద్రమోహన్, కోశాధికారి జి.కవిత, జగదీశ్, బ్రమ్మయ్య, కిషన్, రుద్రకుమార్, వీరయ్య, దేవేందర్, స్వప్న, సాయిబాబు, రామ్మోహన్, కిసరి నర్సిరెడ్డి, సునీత, జిల్లా నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.



