సాంకేతికతలో చంద్రమండలానికి చేరుకుంటున్నాం. కానీ, సామాజికంగా మాత్రం ఇంకా మధ్యయుగాల నాటి కులవ్యవస్థలోనే మగ్గిపోతున్నాం. కులం పేరిట జరుగుతున్న అరాచకం, ఆధిపత్యం ఎంతటి అమానుష స్థితికి చేరిందంటే ఒడిషాలో ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్నే బహిష్కరించే స్థాయికి వెళ్లింది. వేరే సామాజిక వర్గం యువకుడితో తన కుమార్తెకు వివాహ సంబంధం కలుపుకున్నందుకు అతన్ని కులం నుంచి వెలివేస్తున్నట్టు అఖిల భారతీయ బొత్ర పరిషత్ ప్రకటించింది. ఒక మాజీ ప్రజాప్రతినిధి కుటుంబానికే ఇలాంటి అవమానం తప్పలేదంటే మరి సామాన్యుల మాటేమిటి? ప్రేమకు చోటులేని సమాజం శ్మశానంతో సమానమని వేమనవంటి మహానుభావులు ఏనాడో చెప్పారు. ఇలాంటివి చూసినప్పుడు మనం మానవులుగా ఎదుగుతున్నామా, కులాన్ని పెంచి పోషిస్తూ ముర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నామా? అన్నది అర్థం చేసుకోవాలి.
ప్రేమపెళ్లికి కుటుంబానికి అభ్యంతరం లేకపోయినా కులపెద్దలు మాత్రం ససేమిరా అనడం కులగజ్జి కాకపోతే మరేమిటి? దేశం ఆధునికతను సంతరించుకునే కొద్దీ అంతరించి పోవాల్సిన కులం వెర్రితలలు వేయడానికి మన రాజకీయ వ్యవస్థనే కారణం. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ దాదాపు ముప్తై కోట్ల మంది అంటరానితనం, కుల వివక్షతో అణచి వేయబడుతున్నారు. నేడు ప్రపంచంలో జరుగుతున్న కుల దురహంకార హత్యల్లో ప్రతి ఐదింటిలో ఒకటి భారత్‌లోనే చోటుచేసు కోవడం ఎంతటి ప్రమాదకరం. ”అత్యంత హేయమైన, అమానుషమైన, ఘోరమైన ఈ హత్యల వెనుక పరువు ఎక్కడుంది. ఉన్నదల్లా రాక్షసత్వం, భూస్వామ్య ఆధిపత్య మనస్తత్వమే.. ఇటువంటి ఘాతుకాలకు ఒడిగట్టే వాళ్లు కఠిన శిక్షలకు అర్హులు” అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కులతీవ్రతకు అద్దంపడుతోంది. అంతేకాదు, ‘ప్రతి యేటా వందల సంఖ్యలో యువకులు కులానికి బలైపోతున్నారు. దేశంలో కుల దురహంకార జాఢ్యం ప్రమాదకర సమస్యగా మారిందని’ అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించినా ఇవి ఆగకపోగా మరింత పెచ్చరిల్లడం శోచనీయం.
నిజానికి కలిసి బతికేందుకు మనసు లే తప్ప కులాలు కలవాల్సిన పనిలేదు. రాజ్యాంగం ప్రకారం మేజర్ అయిన ప్రతీ యువతీ యవకుడికీ తమకు నచ్చిన వారిని భాగస్వాములుగా ఎంచుకునే హక్కు ఉంది. ఈ హక్కును కాలరాయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాన్ని రక్షించే అధికారులు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. యువత కులాంతర వివాహాల బాట పడితే కులం బతికి బట్టకట్టే పరిస్థితే ఉండదు. ”పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నారు. ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఇష్టపడితే వివాహానికి అంగీకరించాను. దీనికి కుల బహిష్కరణ చేస్తే, నేనేం చేయగలను” అంటూ తమ పిల్లల ఇష్టాన్నే గౌరవించిన మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాన్‌లా అందరూ ఆలోచిస్తే… భూస్వామ్య వ్యవస్థ బద్దలై, సామాజిక అసమానతలు తొలగిపోయి, సరికొత్త సమాజం ఆవిష్కృతమౌతుంది. శ్రీశ్రీ ఆకాంక్షించినట్టుగా ‘ఈ స్వప్నం నిజమౌతుంది/ ఈ స్వర్గం ఋజువౌతుంది’.
మనదేశంలో కులం కొందరికి వరమైతే.. ఎందరికో శాపంగా మారుతోందని చెప్పడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి కులవ్యవస్థ కూడా ఓ కారణమని మనదేశాన్ని లోతుగా పరిశీలించిన సామాజిక శాస్త్రవేత్తల చెబుతున్నారు. కానీ, నేడు కులం ద్వారా ప్రయోజనం పొందే శక్తులే కులాంతర వివాహాలను అడ్డుకుంటూ కుల నిర్మూలనకు ఆటంకంగా మారుతున్న పరిస్థితి ఉంది. అందుకే కులరహిత సమాజాన్ని ఆహ్వానించే సామాజిక చైతన్యం ప్రజల్లో రావాలి. కులాంతర వివాహాలు ఎక్కువగా జరగాలి. కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించడం మనందరి బాధ్యత.
వందలాది కులాలున్న ప్రతి కూలాంతర వివాహమూ కులరహిత సమాజానికై జరుగుతున్న పోరాటంలో ఒక భాగమే. పెండ్లీలకు ‘ఒక్క నీ కులం తప్ప, ఏ కులమైనా ఫర్వాలేదు’ అన్న నినాదం కావాలి. అందుకోసం దేశంలో అతి పెద్ద సాంస్కృతిక విప్లవం రావాలి. ‘ఉర్వివారికెల్ల నొక్క కంచముబెట్టి,/ పొత్తుగుడిపి కులము పొలయజేసి/ తలను చెయ్యిబెట్టి తగనమ్మ చెప్పరా’ అంటూ-భూమ్మీద వున్నవారందరికీ ఒకే కంచంలో పెట్టి, కులాన్ని సర్వనాశనం జేయమని ప్రబోధించి, మానవ సౌభ్రాతృత్వాన్ని వందల ఏండ్ల క్రితమే ప్రచారం చేశాడు వేమన. కరుడుకట్టిన భూస్వామ్య, పురుషాధిక్యత వేళ్లూనుకొని వున్న సమాజంలో ఇది సులభసాధ్యం కాకపోవచ్చు. గానీ, అసాధ్యం మాత్రం కాదు.
ఇంకెన్నాళ్లు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



